
సాక్షి, అమరావతి: అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కారాదనే స్థిర సంకల్పంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలిచి మరీ ప్రయోజనాలను అందచేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. సాధ్యమైనంత వరకు పథకాలను ఎలా ఎగ్గొట్టాలనే గత పాలకుల ఆలోచనలకు పూర్తి భిన్నంగా అర్హులందరికీ వంద శాతం సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది.
► ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారు ఆ పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వెరిఫై చేసి ప్రభుత్వం ఏటా రెండు దఫాలు ప్రయోజనాన్ని అందచేస్తోంది. డిసెంబర్ నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని జూన్‌లో అందిస్తుండగా జూన్ నుంచి నవంబర్ వరకు అమలైన పథకాల ప్రయోజనాన్ని మిగిలిపోయిన అర్హులకు డిసెంబర్‌లో అందిస్తోంది.
► దీంతోపాటు కొత్తగా జూన్ 22 నుంచి నవంబర్ వరకు పెన్షన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హుల వెరిఫికేషన్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నెల 30వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తారు. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్‌తో పాటు అన్ని కార్డులను వలంటీర్లు ఇంటికే వచ్చి అందిస్తారు.
తేడా గమనించండి
► గతంలో జన్మభూమి కమిటీలు ఆమోదించిన వారికి, అస్మదీయులకు మాత్రమే సంక్షేమ ఫలాలతో లబ్ధి. లంచాలమయంగా పథకాల అమలు. వీలైనంత మందికి ఎగ్గొట్టడమే లక్ష్యం. గ్రామంవారీగా లబ్ధిదారుల సంఖ్యపై పరిమితి. ఎవరైనా చనిపోతేనే కొత్త వారికి అవకాశం. నాడు అరకొర పథకాలే.. లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర కాలయాపన.. ఏది కావాలన్నా లంచాలే. సంక్షేమ పథకాల కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని వృద్ధులు, దివ్యాంగులు, అక్క చెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి మోకరిల్లాల్సిన దీనస్థితి. కనికరం కూడా లేకుండా పెన్షన్లలోనూ వాటాల వసూలు.
► ఇప్పుడు కులమతాలు, పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలతో లబ్ధి. ఏ కారణం చేతనైనా ప్రయోజనం పొందని అర్హులకు మరో అవకాశాన్ని కల్పిస్తూ ఏటా జూన్, డిసెంబర్‌లో లబ్ధి చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
► దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించి సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా ఎంపిక. నేరుగా లబ్ధిదారుల అన్ ఇన్‌కంబర్డ్ (గత రుణాలతో నిమిత్తం లేకుండా) ఖాతాలకు నగదు జమ.
► సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి నిర్దిష్ట సమయంలో టంచన్‌గా పంపిణీ. ఆత్మాభిమానాన్ని నిలబెడుతూ ఇంటివద్దే వలంటీర్ల సేవలు.