
విశాఖలో 60 ఎకరాల భూమి కొట్టేసేందుకు కాగితాలపై కంపెనీ సృష్టి
ఉర్సా క్లస్టర్స్ డైరెక్టర్ సతీష్ అబ్బూరి, చిన్ని క్లాస్ మేట్స్.. వ్యాపార భాగస్వాములు
‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రాపర్టీ స్’ పేరుతో ప్రజల్ని మోసగించారు
భూకేటాయింపులను రద్దు చేయండి.. సీఎంకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విశాఖపట్నంలో డేటా సెంటర్ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని విజయవాడ మాజీ ఎంపీ, శివనాథ్ సోదరుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. ఇందుకోసం కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారని చెప్పారు.
ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్‌మేట్స్ అని ‘ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరేనని గుర్తు చేశారు. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ఫేస్‌బుక్, ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
లేఖలో ఏం రాశారంటే..
» విశాఖలో రూ.5,278 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఇటీవల ఏర్పాటు చేసిన కంపెనీకి విశాఖ ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడం ఆందోళనకరం.
» ఆ కంపెనీకి భూ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుట్ర, భూదోపిడి దాగి ఉంది. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బినామీని ముందుపెట్టి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి ఎంపీ చిన్ని ప్రయత్నిస్తున్నారనడానికి బలమైన ఆధారాలున్నాయి.
» ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కేవలం కొన్ని వారాల ముందు మాత్రమే స్థాపించారు. ఆ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును అమలు చేసే సామర్థ్యం లేదు.
» ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని శివనాథ్‌కు ఇంజనీరింగ్ కాలేజీ సహచరుడు. దీర్ఘకాల మిత్రుడు. గతంలో ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యాపార భాగస్వామి కూడా. ఉర్సా బినామీ అబ్బూరి సతీష్ వెనుక ఉన్నది కేశినేని శివనాథే అన్నది ప్రజల్లో బలంగా ఉంది.
» మీడియా నివేదికల ప్రకారం.. ఎంపీ కేశినేని శివనాథ్ ఫ్లైయాష్, ఇసుక, గ్రావెల్‌ను కొల్లగొడుతూ.. గాంబ్లింగ్ డెన్స్ (పేకాట శిబిరాలు) నిర్వహిస్తూ.. రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి.
» పారిశ్రామిక అభివృద్ధి కోసం కాకుండా.. ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉర్సా పేరుతో భూములను కాజేయడానికి ఎంపీ కేశినేని శివనాథ్ కుట్ర చేసినట్లు కనిపిస్తోంది. దీన్ని అనుమతించటం ప్రజా ప్రయోజనాలకు హానికరం. కాబట్టి తక్షణమే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూకేటాయింపును రద్దు చేయండి.
» ఆ కంపెనీ యాజమాన్యం, పెట్టుబడుల మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణకు ఆదేశించండి.