
సిమెంట్ పరిశ్రమలకు శాపం
పల్నాడు జిల్లాలో భవ్య, చెట్టినాడ్ సంస్థలపై గూండాగిరి
ప్రతి సిమెంట్ బస్తాకు కప్పం కట్టాలని హుకుం..
మైనింగ్ కార్యకలాపాల్లో వాటాలు, అనుచరులకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు..
ఫ్యాక్టరీకి వచ్చే లాభాల్లో భాగాలు ఇవ్వాలని ఒత్తిడి
యాజమాన్యాలు తలొగ్గకపోవడంతో ఫ్యాక్టరీ ప్రతినిధులపై దౌర్జన్యాలు..
రైతులకు నష్టం, కర్మాగారాలకు అనుమతుల్లేవంటూ కక్ష సాధింపు
సిమెంట్ ఉత్పత్తి జరగకుండా అడ్డుకుంటున్న అధికార పార్టీ నేతలు
బలవంతంగా ఫ్యాక్టరీ గేట్లు మూత
ఎమ్మెల్యే దుర్మార్గాలు తట్టుకోలేక సంస్థలను తాత్కాలికంగా మూసేసిన యాజమాన్యాలు
రోడ్డునపడ్డ వేలాది మంది కార్మికులు
కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు పారిశ్రామికవేత్తల సన్నాహాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆయన టీడీపీ ఎమ్మెల్యే.. అందరి ప్రజాప్రతినిధుల కంటే ఈయన వైఖరి చాలా భిన్నం. గూండాగిరి ఆయన సహజ లక్షణం. తన స్వలాభం కోసం ఎలాంటి దాదాగిరికైనా వెనుకాడరు. దాడులు, దౌర్జన్యాలకూ తెగబడతారు. సీబీఐ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఈ ఎమ్మెల్యే కన్ను ఇప్పుడు ఈ ప్రాంతంలోని సిమెంట్ ఫ్యాక్టరీలపై పడింది. గతంలో పల్నాడు జిల్లాలో అడ్డగోలుగా మైనింగ్‌ని కొల్లగొట్టి.. రూ.వేల కోట్లు దోచుకున్న పల్నాడు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలను తన దారిలోకి తెచ్చుకునేందుకు అరాచకాలకు తెరలేపారు.
దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని భవ్య (అంజనీ) సిమెంట్ ఫ్యాక్టరీ, అదే మండలంలోని పెదగార్లపాడులోని చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలపై తన అనుచరులతో దాడులు చేయించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు అనుకూలంగా ఉండే అధికారులను ఫ్యాక్టరీల మీదకు ఉసిగొల్పుతున్నారు.
గ్రామస్తులు, రైతులను అడ్డం పెట్టుకుని..
పెదగార్లపాడు గ్రామంలో సుమారు రూ.2వేల కోట్లతో నిర్మించిన చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ 2020 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో పర్మినెంట్, కాంట్రాక్టు పద్ధతిలో 800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకి నాలుగువేల టన్నుల సిమెంట్ ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కన్ను ఈ ఫ్యాక్టరీపై పడింది. తన దందాలను సాధించుకోవడంపై యరపతినేని దృష్టిసారించారు.
ప్రతి సిమెంట్ బస్తాకి కొంత మొత్తం డబ్బు, మైనింగ్ కార్యకలాపాల్లో వాటాలు, తన అనుచరులకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు, ఫ్యాక్టరీకి వచ్చే లాభాల్లో వాటాలూ ఇవ్వాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. దీనికి యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో.. రైతులు, గ్రామస్తులను ముందుపెట్టి ఆందోళనకు తెరలేపారు.
యరపతినేని అరాచకాలు ఇలా..
తొలుత ఫ్యాక్టరీలోకి కార్మికులను రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత..
⇒ సిమెంట్, బొగ్గు, జిప్సం సరఫరా చేసే లారీలను ఫ్యాక్టరీలోకి రానివ్వలేదు.
⇒ అనంతరం.. ఇతర రాష్ట్రాలకు సిమెంట్ సరఫరా చేసే రైలు వ్యాగన్లను కూడా అడ్డుకున్నారు.
⇒ సిమెంట్ లోడ్ కోసం ఫ్యాక్టరీలోకి వెళ్లే లారీలను బలవంతంగా బయటకు పంపి అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు.
⇒ ఆఖరికి ఫ్యాక్టరీకి డీజిల్ సరఫరా చేసే ట్యాంకర్లని కూడా అడ్డుకున్నారు. ఇలా.. యరపతినేని ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోవడంతో రవాణా పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. గతనెల 11 నుంచి ఫ్యాక్టరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ఫ్యాక్టరీ గేట్లకు యాజమాన్యం తాళాలు వేసింది.
భవ్య సిమెంట్ ఫ్యాక్టరీలోనూ బీభత్సం..
ఇదే విధంగా తంగెడ వద్ద ఉన్న భవ్య (అంజనీ) సిమెంట్ ఫ్యాక్టరీపై కూడాయరపతినేని అనుచరులు దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఇక్కడ కూడా రవాణా నిలిచిపోయింది. ఫ్యాక్టరీ లోపలికి యరపతినేని అనుచరులు వెళ్లి నానా హంగామా సృష్టించారు. లారీ డ్రైవర్లపై దాడులకు తెగబడ్డారు. ఈ రెండు ఫ్యాక్టరీలపై యరపతినేని అరాచకాలు చేస్తూ మిగిలిన సిమెంట్ ఫ్యాక్టరీలకు సైతం ఇదే గతి పడుతుందని సంకేతాలు పంపిస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తల్లో అలజడి మొదలైంది.
రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు..
చెట్టినాడ్, భవ్య సిమెంట్ ఫ్యాక్టరీలు మూతపడటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఈ రెండు ఫ్యాక్టరీల ద్వారా రెండువేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అన్ని అనుమతులు ఇవ్వడంతో సకాలంలో నిర్మాణం పూర్తిచేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇప్పుడు రెండు ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు.. యరపతినేని అగడాలు చూసి ఆయా గ్రామాలకు చెందిన సొంత పార్టీ నేతలే చీదరించుకుంటున్నారు.
ఫ్యాక్టరీలపై అధికారుల కక్షసాధింపు..
ఇక చెట్టినాడ్, భవ్య సిమెంట్ ఫ్యాక్టరీల విషయంలో ప్రభుత్వ అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఆత్మీయుడుగా చెప్పుకునే పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు ఫ్యాక్టరీల వ్యవహారంపై యరపతినేనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో.. యరపతినేని ఆదేశాలతో రెండు వారాల క్రితం పల్నాడు కలెక్టరేట్‌లో సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.
ఇక యరపతినేని దగ్గర మెప్పు పొందటం కోసం కొందరు అధికారులు వేలాదిమంది కార్మికులకు ఉపాధి చూపించే ఫ్యాక్టరీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మైనింగ్ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతుల్లేవని.. ఎన్‌ఎస్‌పీ కాలువలపై నిర్మించిన రైలుబ్రిడ్జిలు నాణ్యంగా లేవన్న సాకులు చూపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
పారిశ్రామికవేత్తల అసహనం..
మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై పారిశ్రామికవేత్తలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టేందుకు సమాయత్తమయ్యారు. వెనుకబడిన పల్నాడు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో టీడీపీ కూటమి నేతల దుర్మార్గాలవల్ల జిల్లా మరోసారి తిరోగమనం పడుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది.
టీడీపీ కూటమి పాలనలో వేధింపులు ఎన్నో..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి గత జూన్‌లో అధికారంలోకి వచ్చీరాగానే అరాచకాలకు తెరలేపింది. అప్పటి నుంచి ఆ పార్టీల నేతలు చేయని విధ్వంసం లేదు. పైస్థాయిలోని ‘ముఖ్య’ నేతల దన్నుతో నీకింత.. నాకింత అన్నట్లుగా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. ఉదా..
⇒ ఇక ముంబై నటి కాదంబరి జెత్వానీ విషయంలోనూ లేనిపోని అపోహలు సృష్టించి పారిశ్రామిక దిగ్గజం సజ్జన్ జిందాల్‌ను రాష్ట్రం నుంచి పారిపోయేలా పరిస్థితులు సృష్టించారు. ఇలా.. టీడీపీ నేతల ఆగడాలు భరించలేక పారిశ్రామికవేత్తలు
బెంబేలెత్తిపోతున్నారు.
⇒ కాకినాడ పోర్టు, సెజ్‌ను బెదిరించి తన నుంచి లాగేసుకున్నారని టీడీపీ సానుభూతిపరుడు కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో అరబిందో ఫార్మాకు చెందిన శరత్‌చంద్రారెడ్డిని కేసులతో వేధిస్తున్నారు.
⇒ గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజుల్లోనే శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీలో టీడీపీ శ్రేణులు అలజడి సృష్టించారు. నెలనెలా కప్పం కడితే తప్ప లోడ్ లారీలు బయటకు రాలేని పరిస్థితులు సృష్టించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో స్థానిక టీడీపీ నేతలకు తలొగ్గింది.
⇒ అలాగే, ఫ్లైయాష్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య చెలరేగిన రగడ అంతాఇంతా కాదు. ఫైయాష్ లోడింగ్ విషయంలో వీరి మధ్య తలెత్తిన వివాదంతో ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) ట్రాన్స్‌పోర్టు యజమానులు బాగా నలిగిపోయారు.