
అమరావతి: విజయవాడలో రేపు (బుధవారం) కృష్ణా రివర్ బోర్డ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఈఎన్‌సి నారాయణ రెడ్డి, ఇంటర్ స్టేట్ ఎస్‌ఈ శ్రీనివాస్ రెడ్డి హజరు కానున్నారు. తెలంగాణ అక్రమ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ఈ సమావేశంలో ఏపీ అధికారులు కోరనున్నారు.
ఈ ఏడాది ఏపీకి 80 శాతం, తెలంగాణకు 20 శాతం కృష్ణాజలాలు కేటాయించాలని బోర్డును ఏపీ అధికారులు కోరే అవకాశం ఉంది. అదే విధంగా, మిగులు జలాల వినియోగాన్ని లెక్కించాలన్న తెలంగాణ వాదనను ఏపీ అధికారులు తోసిపుచ్చనున్నారు. మొత్తం పది అంశాలపై తమ వాదనను వినిపిస్తామని ఏపీ అధికారులు తెలిపారు.