
కూటమి ఓటమి నంద్యాల నుంచే మొదలవ్వాలని ముస్లిం నేతల పిలుపు
వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్
నంద్యాల, నెల్లూరులో నిరసన ర్యాలీలు
నంద్యాల (అర్బన్)/నెల్లూరు(బృందావనం): ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ నాయకులు నినదించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ సోమవారం నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ముస్లిం, ఇతర సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి.
గాంధీచౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ అధ్యక్షతన జరిగిన ర్యాలీలో గౌరవాధ్యక్షులు మహమ్మద్ అబులైజ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను ఇబ్బంది పెడుతోందన్నారు. జేఏసీ నాయకులు అబ్దుల్ సమ్మద్, కో–కన్వీనర్ మస్తాన్‌ఖాన్ మాట్లాడుతూ.. ముస్లింలకు న్యాయం చేస్తారని కూటమి పారీ్టలకు ఓటు వేస్తే నమ్మక ద్రోహం చేశాయన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు. కూటమి ఓటమి నంద్యాల నుంచే ప్రారంభమవ్వాలని, వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులకు గుణపాఠం చెప్పాలన్నారు. ముస్లింలను వంచించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం మాకొద్దు
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నెల్లూరులో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో గంటలకొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కోటమిట్ల షాదీమంజిల్ నుంచి బయలుదేరిన ర్యాలీ గాందీబోమ్మ సెంటర్ వరకు సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణచివేయడానికి వక్ఫ్ చట్టానికి సవరణ చేసిందని ముస్లిం నేతలు ఆరోపించారు.
భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మౌలానా మొహ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని అసలైన ముస్లింలు ఒప్పుకోరన్నారు. ఇతర మతస్తులను వక్ఫ్‌బోర్డులో నియమించడం సమంజసం కాదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు సమీర్‌ఖాన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు దొంగబుద్ధితో బీజేపీ ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలకు ద్రోహం చేశారన్నారు.