రూలర్స్‌..రూల్స్‌ బ్రేక్‌ | Riding Without Helmet Collector Harendira Prasad | Sakshi

రూలర్స్‌..రూల్స్‌ బ్రేక్‌

Published Wed, Sep 11 2024 12:03 PM | Last Updated on Wed, Sep 11 2024 12:04 PM

Riding Without Helmet Collector Harendira Prasad

 హెల్మెట్‌ లేకుండా ప్రయాణించిన కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, ఎమ్మెల్యే గణబాబు 

 సామాన్యులకేనా నిబంధనలు, జరిమానాలు, లైసెన్సు రద్దు 

 5 రోజుల్లో 1199 మంది లైసెన్సులు తాత్కాలిక రద్దు 

ఈ ఫొటోల్లో రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి... హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.1,030 అపరాధ రుసుం విధించడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.

ఈ ఫొటోల్లో ఏకంగా జిల్లా కలెక్టర్‌ హరేందర్‌ ప్రసాద్‌, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చొని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ను పరిశీలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి గానీ వెనుక కూర్చున్న కలెక్టర్‌, గణబాబు గానీ హెల్మెట్‌ ధరించలేదు. ద్విచక్ర వాహనం మీద ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్లు ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తుంగలో తొక్కుతున్నా.. అటువైపు కనీసం రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. చట్టం అధికారం ఉన్న వాడికి చుట్టమనే నానుడి ఇటువంటి అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల మరింత బలపడినట్టయింది.

గోపాలపట్నం: జిల్లాలో హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారంటూ... ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు 1,199 మందికి రూ.1,035 అపరాధ రుసుం విధించడంతో పాటు లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేశారు. మూడు నెలల వరకు వీరెవ్వరూ వాహనాన్ని నడిపేందుకు అవకాశం లేదు. వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు కఠినంగా వ్యవహరించాల్సిందే. దీనిని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే సాధారణ ప్రజలకు ఒక విధంగా.. అధికారం ఉన్న వారి పట్ల మరో విధంగా ప్రవర్తించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

విస్తృతంగా తనిఖీలు
ద్విచక్రవాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో అమలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపే వారికి రూ.1035 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. వీరు మూడు నెలల తరువాత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి జరిమానా విధించిన రశీదు, ఆధార్‌ కార్డు అందజేస్తే లైసెన్సును పునరుద్ధరిస్తారు.

హెల్మెట్‌ ధారణ తప్పనిసరి
హెల్మెట్లు లేకుండా ప్రయాణించడంతోనే చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్నవారు కూడా కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని కొద్ది రోజులుగా అవగాహన కల్పించాం. ఈ నెల ఒకటో తేదీ నుంచి నిబంధనలను అమలు చేస్తున్నాం. ఐదు రోజుల్లో 1,199 మంది లైసెన్సులను రద్దు చేశాం. పోలీసుల వద్ద సుమారు 3 వేల వరకు ఈ రశీదులున్నాయి. వాటిని కూడా సేకరించి రద్దు చేసే చర్యలు చేపడతాం.
– రాజారత్నం, ఉప రవాణా కమిషనర్‌, విశాఖ

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement