
సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి నుంచే ఎండలు మండుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... వేసవి కాలం ఫిబ్రవరి నెలలోనే వచ్చేసిందా అనేలా కొన్ని చోట్ల పరిస్థితులు కనిపించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో 38.6 సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ వేసవిలో సూర్యుడు మార్చి నెల నుంచే సుర్రుమనిపిస్తున్నాడని, ఏప్రిల్, మే నెలల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఆయన మీడియాకు ఓప్రకటన విడుదల చేశారు.
» మార్చి నుంచి మే వరకు చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాలులు వీయవచ్చు.
» మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావంఎక్కువగా ఉంటుంది.
» విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు చేస్తుంది.
» జిల్లా యంత్రాంగాలకు రెండు రోజుల ముందుగానే వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనుంది.
» ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలి.
» ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెట్ల కింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.