
ఖైదీల విద్యా వికాసానికి కృషి
ఖర్చంతా జైలు సంక్షేమ నిధి నుంచే..
విద్యా కేంద్రంగా విశాఖ సెంట్రల్ జైలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం శిక్షా కేంద్రంగానే కాకుండా.. విద్యా కేంద్రంగానూ రూపాంతరం చెందుతోంది. నేరాల చీకటిలో మగ్గుతున్న ఖైదీలకు విద్య ద్వారా కొత్త జీవితాన్ని వెలిగించే ప్రయత్నం జరుగుతోంది. కారాగారం (Jail) నాలుగు గోడల మధ్యనే ప్రాథమిక విద్య నుంచి పోస్ట్–గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే సౌకర్యం ఉండటం విశేషం. 2024–25 విద్యా సంవత్సరంలో 120 మంది ఖైదీలు విద్యను అభ్యసిస్తున్నారు.
వీరిలో 90 మంది ప్రాథమిక విద్యను పూర్తి చేస్తుండగా.. 19 మంది పదో తరగతి ఓపెన్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలను రాశారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్న ఖైదీలు ఖాళీ సమయాల్లో చదువుకుంటూ డిగ్రీలు పొందుతున్నారు.
కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లిష్ (Spoken English) తరగతులు, వివిధ వృత్తుల్లో ఇక్కడ ఖైదీలు శిక్షణ పొందుతున్నారు. గతంలో ఇక్కడ శిక్ష అనుభవించిన ఒక ఖైదీ పీజీ పూర్తి చేసి బంగారు పతకం సాధించడం విశేషం. పని చేస్తూనే చదువుకునే వెసులుబాటు ఉండటంతో, శిక్ష పూర్తయిన అనంతరం విద్యావంతులుగా బయటకు వస్తున్న ఖైదీల సంఖ్య పెరుగుతోంది.
అన్నీ జ్ఞానసాగర్‌లోనే..
జైలు లోపల ‘జ్ఞానసాగర్’ పేరుతో విద్యాలయం ఉంది. ఇక్కడ గ్రంథాలయం, తరగతి నిర్వహణ, విద్యా బోధన, పరీక్షల నిర్వహణ తదితర సౌకర్యాలు ఉన్నాయి. రిమాండ్‌లో ఉన్న ఖైదీలు, శిక్ష పడిన ఖైదీలు ఇక్కడ చదువుకుని పరీక్షలు రాయవచ్చు. చదువు లేని వారికి వయోజన విద్య ద్వారా అక్షరజ్ఞానం కలిగిస్తున్నారు. వారికి ప్రాథమిక స్థాయి నుంచి చదవడం, రాయడం నేర్పుతున్నారు.
ఇందుకోసం జైళ్ల శాఖ ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఈ ఉపాధ్యాయుడు ఖైదీల విద్యా సంబంధిత విషయాలన్నింటినీ చూసుకుంటారు. ఖైదీలు పరీక్షలకు దరఖాస్తు చేసినప్పటి నుంచి వారికి తరగతులు నిర్వహించడం, సందేహాలు తీర్చడం, పరీక్షలు నిర్వహించడం వరకు ఆయనే ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. తరగతులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతాయి.
ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే..
ఇక్కడ ప్రతి సంవత్సరం చదువుకున్న ఖైదీల సంఖ్య మారుతూ ఉంటుంది. కొత్త వారు రావడం, శిక్ష పూర్తయిన వారు వెళ్లిపోవడం వల్ల ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 55 మంది ఖైదీలు ఓపెన్ పదో తరగతిలో చేరారు. 20 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సును 29 మంది పూర్తి చేయగా, ఒకరు పీజీలో ఎంఏ పరీక్షలు రాశారు.
2020–21లో 80 మంది ప్రాథమిక విద్య, 26 మంది ఓపెన్ టెన్త్, 14 బీఏ చదువుకున్నారు.
2021–22లో 90 మంది ప్రాథమిక విద్య, 10 మంది ఓపెన్ టెన్త్, 9 మంది బీఏ విద్యనభ్యసించారు.
2022–23లో 82 మంది ప్రాథమిక విద్య, ఆరుగురు బీఏ, ఒకరు ఎంఏ చదివారు.
2023–24లో 80 మంది ప్రాథమిక విద్య, 9 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ చదివారు.
2024–25 (ప్రస్తుతం)లో 90 మంది ప్రాథమిక విద్య కొనసాగిస్తుండగా, 19 మంది ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.
ఖైదీల్లో మార్పు కోసం..
ఖైదీల్లో పరివర్తనం సాధించడానికి చదువు ఉపయోగపడుతుంది. విచక్షణ కల్పించడానికే ఇక్కడ ఖైదీలను విద్యావంతులను చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా నియమించిన ఉపాధ్యాయుడు ద్వారా వారికి బోధన జరుగుతోంది. ఖైదీల చదువుకు అయ్యే ఖర్చు, పరీక్ష ఫీజులను జైలు సంక్షేమ నిధి నుంచే చెల్లిస్తున్నాం. చదువు మధ్యలో నిలిపివేసి జైలుకు వచ్చినవారు.. ఇక్కడ చదువు కొనసాగించుకోవచ్చు.
– ఎన్.సాయిప్రవీణ్, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్