
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణాన్ని బయట పెట్టినందుకే ఇప్పుడు పోటీగా కేసును పెట్టారని చెప్పుకొచ్చారు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. లిక్కర్ కేసులో భేతాళ కథలు, కుట్రలు తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. దీనిపై ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో లిక్కర్ స్కాం అంటూ ఎవరితోనో ఒక లెటర్ రాయించి కేవలం తొమ్మిది రోజుల్లోనే విచారణ చేసినట్టు చూపించారు. అసలు ఆ తొమ్మిది రోజుల్లో ఎవరెవరిని విచారణ చేశారో కూడా చెప్పలేదు. తాము ఇరికించాలనుకున్న వ్యక్తుల పేర్లను లిక్కర్ కేసులో వరుసగా పెట్టేస్తున్నారు. సిట్‌ని ఏర్పాటు చేస్తే దానికంటూ ప్రత్యేకంగా ఒక పోలీసు స్టేషన్ ఉండాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ అవేమీ లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు
అప్పటి ముఖ్యమంత్రిని కూడా కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్‌లోని అధికారులంతా పాలకులు చెప్పినట్టే కేసును నడిపిస్తున్నారు. గౌరవంగా బతికే పారిశ్రామికవేత్తలను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంని బయటపెట్టినందుకే పోటీగా ఇప్పుడు కేసును పెట్టారు. నేర అంగీకార పత్రాలపై రాజ్ కెసిరెడ్డి సంతకాలు చేయలేదు. దీన్ని కోర్టు కూడా గుర్తించింది. అయినప్పటికీ ఎల్లో మీడియా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోంది.
జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా లిక్కర్ పాలసీ అమలైంది. చంద్రబాబు హయాంలో స్కాం జరిగినట్టు లెక్కలే తేల్చాయి. 53% మద్యాన్ని నాలుగు కంపెనీల ద్వారా కొనుగోలు చేయటం వెనుక కుట్ర దాగుంది. ఈ అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వానికి దమ్ముందా?. సీబీఐతో విచారణకు ముందుకు రాగలరా?. మా సవాల్ స్వీకరించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా?. జగన్ హయాంలో పారదర్శకంగా లిక్కర్ పాలసీ అమలైనందున అక్రమాలకు అవకాశం లేదు. కానీ మిథున్‌రెడ్డి సహా అనేక మందిని ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. పోలీసు అధికారులు చట్టప్రకారం చేయాల్సిన పని చేయటం లేదు. పారిశ్రామిక వేత్తల నుండి వైఎస్సార్‌సీపీ నేతల వరకు అందరినీ బెదిరిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసి, ఇబ్బందులు పెడుతున్న పోలీసులపై చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరించారు.
