
ఉద్యోగాలు పీకేసిన పాపం చంద్రబాబు, లోకేష్, పవన్‌లదే
రైల్వేకోడూరు అర్బన్ : మంగంపేటలో స్థానిక యువకులకు తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తే అందులో 375 మందికి ఉద్యోగాలు పీకేసి వారి కుటుంబాలు రోడ్డున పడేటట్లు చేసిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌లదేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎండీసీలో తీసేసిన ఉద్యోగులను తిరిగి చేర్చుకోకుంటే విజయవాడ, మంగంపేటలలో ఆందోళనలు చేసేందుకు ప్రజా సంఘాలు, ఇతర పార్టీలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్‌లు 25 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ యువకులకు ద్రోహం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అవసరాలకు మంగంపేట ఖనిజం కావాలి కానీ ఇక్కడి ప్రజలకు ఉద్యోగాలు వద్దా అని నిలదీశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, ఇన్‌చార్జి, కూటమి నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మందల నాగేంద్ర, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల