
వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
దమ్మపేట: అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి వచ్చే వేధింపులు తాళలేక, పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన మడిపల్లి శ్రీనివాసరావు(48) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం మందలపల్లి, రంగువారిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. కాగా అప్పు తిరిగి చెల్లించాలని అప్పిచ్చిన వ్యక్తులు వేఽధింపులకు గురిచేశారు. దీంతో శ్రీనివాసరావు మనోవేదన చెంది బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.