
ధాన్యం కాపాడేదెట్టా..?
పాల్వంచరూరల్: అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను రక్షించుకునేందుకు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ధాన్యం, మిర్చి కల్లాల్లో ఆరబెడితే వానలకు తడిసిపోతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే రైతుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. టార్పాలిన్ పట్టాలు కప్పుకుని కాపాడుకుందామంటే ప్రభుత్వం వాటిని సరఫరా చేయడంలేదు. దీంతో ఏటా యాసంగి సీజన్‌లో రైతులు నష్టపోతున్నారు.
గతంలో 50 శాతం సబ్సిడీపై..
యాసంగి సీజన్‌లో అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 30,557మంది రైతులు 74,600 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసిపోయింది. గతంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై టార్పాలిన్లు (పట్టాలు) అందించారు. మార్కెట్‌లో టార్పాలిన్ ధర రూ.2500 ఉంటే ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రూ.1250కు ఇచ్చేది. దీంతో రైతులు అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేవారు. కానీ 2017 నుంచి టార్పాలిన్ పట్టాల పంపిణీ నిలిపివేశారు. దీంతో ఎనిమిదేళ్లుగా టార్పాలిన్ల పట్టాల కొరత రైతులను వేధిస్తోంది.
అద్దెకు తీసుకుందామంటే అధిక ధర
ధాన్యం తడవకుండా పరదాలను రైతులు అద్దెకు తెచ్చి వినియోగించుకుంటున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు పట్టణాలకు వెళ్లి పరదాలను అద్దెకు తెస్తున్నారు. ఒక్కో పరదాకు రోజుకు రూ.20పైన చెల్లించాల్సివస్తోంది. దీనికితోడు రానుపోను చార్జీలు కలిపి రైతులపై భారం పడుతోంది.
పట్టాల్లేక అకాల వర్షంతో తడిసిపోతున్న వడ్లు
ఏటా యాసంగి సీజన్‌లో రైతులకు తప్పని ఇక్కట్లు
గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు మంజూరు
2017 నుంచి పంపిణీ నిలిపివేసిన ప్రభుత్వం
ప్రైవేటులో నాణ్యతలేని పరదాలు
ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. సమీప పట్టణాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్‌లకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటుగా కొనుగోలు చేసిన మన్నిక, నాణ్యత ఉండటం లేదని, నాసిరకంగా ఉండటంతో వర్షాలు కురిసినప్పుడు పంటలు తడిసిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికీ పాతవి, పాడైన టార్పాలిన్లనే వినియోగిస్తున్నారు. కొందరు గోనె సంచులను ఉపయోగిస్తున్నా పెద్దగా ఉపయోగం ఉండటంలేదు. ధాన్యం తడిసి మళ్లీ తేమశాతం పెరిగి కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు తప్పడం లేదు.