
మూడు నుంచి ఐదేళ్ల కాలానికి.. కార్పొరేట్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్, పీఎస్‌యూ ఫండ్స్‌లో ఏది అనుకూలం? – మంజునాథ్
కార్పొరేట్ బాండ్ ఫండ్స్ 80 శాతం అధిక క్రెడిట్ రేటింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ 80 శాతం బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటితోపాటు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్ని రకాల పరిస్థితుల్లోనూ అనుకూలమైనవి. దీర్ఘకాలంలో వీటిలోని రిస్క్–రాబడులు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి.
ఇన్వెస్టర్లు రెండు కారణాల దృష్ట్యా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వివిధ రకాల డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వైవిధ్యం ఎక్కువ. మెచ్యూరిటీ కాలంపై స్పష్టత ఉంటుంది. ఏడాది కాలానికి మించిన లక్ష్యాల కోసం, డెట్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.
ఇంటి బడ్జెట్ విషయంలో 50–30–20 ఆర్థిక సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక అంశాలకు ఇది మంచి సూత్రమేనా? – కరణ్ రాథోడ్
మీ నెలవారీ ఆదాయాలను ఏ రకంగా వర్గీకరించాలన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఆదాయంలో 20 శాతాన్ని అవసరాల కోసం కేటాయించాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 50 శాతానికే పరిమితం కావాలి. ఆదాయంలో 30 శాతాన్ని కోరికల కోసం కేటాయించుకోవచ్చు. అంటే రెస్టారెంట్లలో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్, ఇతర హాబీల కోసం కేటాయింపులు 30 శాతం మించకూడదు. ఇక మిగిలిన 20 శాతాన్ని పొదుపు కోసం కేటాయించాలి.
మీ ఆర్థిక అంశాలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది అనుకూలిస్తుంది. ముఖ్యంగా వేతన జీవులు, అప్పుడే కెరీర్ ఆరంభించిన వారికి ఇది ఎంతో సులభం. కాకపోతే ఇదొక సాధారణ సూత్రమే కానీ, అందరికీ అనుకూలమని చెప్పలేం. వ్యక్తిగత ఆదాయం, జీవన వ్యయాలు, బాధ్యతలు ఇవే ఒకరి బడ్జెట్‌ను నిర్ణయించేవి.
ఉదాహరణకు ఒక నగరానికి చెందిన యువ ఉద్యోగి నెలకు రూ.40,000 సంపాదిస్తున్నాడని అనుకుందాం. పెద్ద నగరం కావడంతో అద్దెకు, రవాణా కోసమే నెల జీతంలో సగం ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు కోరికలు, పొదుపు కోసం మిగిలేదేమీ ఉండదు. అదే రూ.2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి అయితే ఆదాయంలో 30–35 శాతంతోనే అవసరాలను తీర్చుకోవడం సులభం. అప్పుడు పొదుపు చేయడానికి 30–40 శాతం మిగులు ఉంటుంది.
కనీసం 20 శాతం పొదుపు
ఎవరైనా సరే బడ్జెట్ ఆరంభించేందుకు 50–30–20 సూత్రం మంచి ఫలితమిస్తుంది. మీ జీవన అవసరాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. అలాగే, ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేయాలి. కోరికల విషయంలో కొంత రాజీ పడినా సరే పొదుపును కొనసాగించాలి.
ఎలా ఆరంభించాలో తెలియకపోతే అప్పుడు ఆదాయంలో 20 శాతాన్ని పెట్టుబడులకు మళ్లించే విధంగా ఆటోమేట్ చేసుకోవాలి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్లేలా సిప్ పెట్టుకోవాలి. మొదట పొదుపు, పెట్టుబడి తర్వాతే ఖర్చులకు వెళ్లాలి. స్థిరమైన పొదుపు, వివేకంతో చేసే ఖర్చుతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.
సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్