
న్యూఢిల్లీ: బ్యాంక్‌టెక్ రంగంలోకి పెట్టుబడులు 2027 నాటికి బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8,600 కోట్లు) చేరతాయని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘సెడార్–ఐబీఎస్‌ఐ క్యాపిటల్’ తన అంచనాను వెల్లడించింది. 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో వృద్ధిని నడిపించడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది.
విప్లవాత్మక టెక్నాలజీలు భారత్‌లో బ్యాంకింగ్ సేవలను సమూలంగా మార్చేస్తున్నట్టు సెడార్ ఐబీఎస్‌ఐ వ్యవస్థాపకుడు, ఎండీ సాహిల్ ఆనంద్ తెలిపారు. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల్లో 80 శాతాన్ని ప్రస్తుతం డిజిటల్‌గా నిర్వహిస్తున్నట్టు ఓ పరిశోధన వివరాలను గుర్తు చేశారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.
వీటి ఫలితంగా మారుమూల ప్రాంతాల్లోని వారికీ బ్యాంకింగ్ సేవలు అందుతున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని డిజిటల్‌గా మార్చడంలో క్లౌడ్ కంప్యూటింగ్ కీలకంగా పనిచేస్తోందంటూ.. సేవల విస్తరణ, చురుకుదనం, వ్యయాల కట్టడి ప్రయోజనాలు దీంతో లభిస్తున్నట్టు వివరించారు. సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీలకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయపడుతన్నట్టు ఆనంద్ వెల్లడించారు.
ముఖ్యంగా సప్లయ్ చైన్ ఫైనాన్స్, గుర్తింపు నిర్వహణలో ఇది ఎంతో మార్పును తీసుకొస్తున్నట్టు చెప్పారు. సెడార్–ఐబీఎస్‌ఐ క్యాపిటల్ ఇప్పటికే బ్యంక్‌టెక్ రంగంలో రెండు లావాదేవీలతో మొత్తం రూ.240 కోట్ల పెట్టుబడులు పెట్టిందని.. తమ పోర్ట్‌ఫోలియోని 10–15 స్టార్టప్‌లకు విస్తరించనున్నట్టు ఆనంద్ ప్రకటించారు.