
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్విక్ కామర్స్ రంగంలో సంచలనానికి బ్లింకిట్ తెరతీసింది. ఇప్పటి వరకు ఆహారం, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు పరిమితమైన క్విక్ కామర్స్(Quick Commerce) రంగంలో ఏకంగా అంబులెన్స్ సేవలకు కంపెనీ శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాతిపదికన ఈ సేవలను మొదట గురుగ్రామ్‌లో ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ సర్వీసులను విస్తరించనుననట్లు కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..
ఆక్సిజన్ సిలిండర్, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్ (ఏఈడీ), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు ఈ అంబులెన్సులో ఉంటాయి. డ్రైవర్‌తోపాటు పారామెడిక్, డ్యూటీ అసిస్టెంట్ సైతం ఉంటారు. ‘నగరాల్లో త్వరిత, విశ్వసనీయ అంబులెన్స్(Ambulance) సేవలను అందించే విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా మొదటి అడుగు వేస్తున్నాం. గురుగ్రామ్‌లో తొలి ఐదు అంబులెన్స్‌లు రోడ్డెక్కనున్నాయి. వచ్చే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. లాభం లక్ష్యం కాదు. కస్టమర్లకు సరసమైన ధరతో ఈ సేవను నిర్వహిస్తాం. దీర్ఘకాలికంగా ఈ క్లిష్ట సమస్యను నిజంగా పరిష్కరించడంలో పెట్టుబడి పెట్టాం’ అని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా చెప్పారు.