
ఈ సారి ‘లక్ష’య తృతీయ!
మరో రూ.1,800 పెరుగుదల
ఢిల్లీలో ధర రూ.1,01,600
అంతర్జాతీయ మార్కెట్లో 3,500 డాలర్లు
న్యూఢిల్లీ: బంగారం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టం నమోదైంది. అక్షయ తృతీయకు వారం రోజుల ముందే కీలకమైన రూ.లక్ష మార్క్‌ను పసిడి దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ మొదటిసారి 3,500 డాలర్లను అధిగమించింది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే కలిసొస్తుందన్నది హిందువుల విశ్వాసం. అందుకే ఏటా ఆ రోజున (ఈ నెల 30) కొనుగోళ్లు అధికంగా నమోదవుతుంటాయి.
దీనికితోడు మే చివరి వరకు కొనసాగే పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. స్టాకిస్టులు, ఆభరణాల వర్తకులు బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం ధరలు ఎగిసేలా చేసినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,800 పెరిగి రూ.1,01,600 ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం రూ.2,800 ఎగసి రూ.1,02,100కు చేరుకోవడం విశేషం. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలోకి రూ.98,500వద్దే ఉంది.
తాజా పరిణామాలు..
వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన సైతం తాజా పసిడి ధరల ఆజ్యానికి కారణమన్నది కామా జ్యుయలరీ ఎండీ కొలిన్‌షా అభిప్రాయంగా ఉంది. డాలర్ బలహీనత కొనసాగితే అప్పుడు ఇతర కరెన్సీల్లో బంగారం ధరలు దిగిరావచ్చన్నారు. బంగారాన్ని డాలర్ మారకంలోనే మనం కొనుగోలు చేస్తుంటామన్నది తెలిసిందే. మరోవైపు చైనా ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకునే దేశాలపై ప్రతిచర్యలు ఉంటాయన్న చైనా హెచ్చరిక సైతం సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్‌ను పెంచినట్టు కోటక్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) కేనత్ చెయిన్‌వాలా తెలిపారు.
స్వర్ణ యుగం
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరగడం చూస్తున్నాం. ఇది స్వర్ణయుగం. బంగారానికి ఈ ఏడాది ఎంతో ముఖ్యమైనది. జనవరి నుంచి చూస్తే అంతర్జాతీయంగా బంగారం ధరలు 25% పెరిగి ఔన్స్‌కు 3,500 డాలర్లకు చేరాయి. భారత్‌లోనూ చారిత్రక గరిష్టం రూ.లక్ష మార్క్‌నకు (10 గ్రాములు) చేరడం ద్వారా పసిడిపై ఉన్న నమ్మకాన్ని బలోపేతం చేసింది. సురక్షిత సాధనంగా బంగారానికి ఉన్న గుర్తింపు సైతం ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. ధరల్లో ఆటుపోట్లతో సంబంధం లేకుండా ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా భారత్‌లో బంగారం కొనుగోళ్లు కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. – సచిన్ జైన్, ప్రపంచ స్వర్ణ మండలి భారత్ సీఈవో
100 రోజుల్లోనే... 28 శాతం ర్యాలీ
ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే బంగారం ధర 28 శాతం ర్యాలీ చేసింది. జవవరి 1న రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే 10 గ్రాములకు రూ.22,210 లాభపడడం గమనార్హం. పసిడి గమనం విశ్లేషకుల అంచనాలకూ అంతుచిక్కడం లేదు. ఈ ఏడాది చివరికి బంగారం ఔన్స్‌కు 3,500 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ 10 రోజుల క్రితమే (11న) అంచనా వేసింది. అంత కాలం పాటు నేను ఆగుతానా? అన్నట్టు మంగళవారమే పసిడి అంతర్జాతీయ మార్కెట్లో 3,509 డాలర్ల రికార్డు స్థాయిని నమోదు చేసింది.
ఈ ఏడాది బంగారం 3,700 డాలర్లకు చేరుకోవచ్చన్నది మరో అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అంచనా. ప్రస్తుత వేగాన్ని చూస్తుంటే ఈ రికార్డు కూడా త్వరలోనే నమోదవుతుందేమో? చూడాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం కొనసాగినంత కాలం బంగారం ధరలు శాంతించకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లేదంటే డాలర్ అయినా ప్రస్తుత స్థాయి నుంచి మరింత బలహీనడాల్సి ఉంటుంది. అలా జరిగినా పసిడి ధరలు దిగివచ్చే అవకాశాలు ఉంటాయి.