
న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా ఐదు విభాగాల స్టీల్ ప్రొడక్టులపై సేఫ్‌గార్డ్ డ్యూటీకి తెరతీసింది. 200 రోజులపాటు అమలయ్యే విధంగా 12 శాతం సుంకాన్ని విధించింది. ఈ జాబితాలో హాట్ రోల్‌డ్ క్వాయిల్స్, షీట్లు, ప్లేట్లు తదితరాలున్నాయి. తద్వారా పెరుగుతున్న దిగుమతుల నుంచి దేశీ సంస్థలకు రక్షణ కలి్పంచేందుకు చర్యలు చేపట్టింది.
వాణిజ్య శాఖ దర్యాప్తు విభాగం డీజీటీఆర్ సలహాలమేరకు ప్రభుత్వం స్టీల్ దిగుమతులపై తాజా సుంకాలను విధించింది. వాణిజ్య పరిష్కారాల డైరెక్టర్ జనరల్ సూచనలమేరకు కేంద్ర ప్రభుత్వం 12 శాతం విలువ ఆధారిత ప్రొవిజనల్ సేఫ్‌గార్డ్ డ్యూటీని విధించినట్లు ఆదాయ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా సుంకాలు గడువుకంటే ముందుగా ఎత్తివేయడం లేదా మార్పులు చేపట్టడం వంటివిలేకుంటే 200 రోజులపాటు అమల్లో ఉంటాయని తెలియజేసింది.
సుంకాల పరిధిలో చేర్చిన ఐదు రకాల(విభాగాల) స్టీల్ ప్రొడక్టుల దిగుమతి ధరలు టన్నుకి 675 డాలర్ల నుంచి 964 డాలర్ల మధ్య నిర్ణయించింది. ఈ ధరలకంటే దిగువన దిగుమతయ్యే ప్రొడక్టులకు సేఫ్‌గార్డ్ డ్యూటీ వర్తించనుంది. వీటికంటే అధిక ధరలకు దిగుమతయ్యే(జాబితాలో చేర్చిన) ప్రొడక్టులపై సుంకాలు అమలుకాబోవు.