
కొత్త కంపెనీ ఏర్పాటు
100 మిలియన్ డాలర్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ టెక్నాలజీ దిగ్గజం సైయెంట్ తాజాగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ’సైయెంట్ సెమీకండక్టర్స్’ పేరిట ప్రత్యేక కంపెనీని ప్రారంభించింది. దీనిపై 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు వెల్లడించారు. దీనికి సుమన్ నారాయణ్ సీఈవోగా వ్యవహరిస్తారని తెలిపారు.
దేశవిదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు, డిస్కంలు సహా వివిధ పరిశ్రమలకు అవసరమైన సిలికాన్ చిప్ సొల్యూషన్స్‌ను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు కృష్ణ వివరించారు. కంపెనీ విస్తరణ కోసం సెపె్టంబర్ నాటికి ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు కృష్ణ వివరించారు. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లను నియమించుకునే ప్రక్రియపై కొనసాగుతోందన్నారు.
ఇలా సమీకరించిన నిధుల్లో సింహభాగం వాటా పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలు, నిపుణుల నియామకాలపై వెచ్చించనున్నట్లు కృష్ణ చెప్పారు. ప్రస్తుతం సెమీకండక్టర్ల సంబంధ విధులు నిర్వర్తిస్తున్న సుమారు 400 మంది సిబ్బందిని, కొత్త కంపెనీకి బదలాయించనున్నట్లు తెలిపారు. కొత్త సంస్థను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేసే యోచన ఉన్నట్లు కృష్ణ పేర్కొన్నారు. సెమీకండక్టర్ వ్యవస్థలో భారత్ స్వావలంబన సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.