
బాగా చదువుకుని ఉద్యోగం చేయాలి, జీవితం సెటిల్ అవ్వాలని చాలామంది చిన్నప్పటి నుంచే చెబుతూ ఉంటారు. ఆ మాటలనే వింటూ.. డిగ్రీలు పూర్తి చేసుకుని ఏదో ఒక కంపెనీలో చేరి.. నెలనెలా జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతున్న ఉద్యోగులు కోకొల్లలు. ఇలాంటి ఉద్యోగులంతా.. ప్రమాదంలో ఉన్నారని, అలాంటి ఉద్యోగాలు కనుమరుగవుతాయని.. పోర్ట్‌ఫోలియో - మేనేజ్‌మెంట్ సర్వీస్ కంపెనీ మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, మార్కెట్ ఎనలిస్ట్ 'సౌరభ్ ముఖర్జియా' అన్నారు.
'బియాండ్ ది పేచెక్: ఇండియాస్ ఎంటర్‌ప్రెన్యూర్ రీబర్త్' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారతదేశం కొత్త ఆర్థిక దశలోకి ప్రవేశించింది. జీతాలపైన జీవించే మధ్యతరగతి వర్గం కనుమరుగవుతుంది అన్నారు. మంచి చదువులు చదివి, కష్టపడి పనిచేసేవారికి జీతాలిచ్చే కంపెనీలు తగ్గిపోతాయి.
ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయిత
ఇప్పుడు దాదాపు చాలా కంపెనీలలో ఆటోమిషన్, ఏఐ ద్వారానే పనులు పూర్తిచేస్తున్నారు. దిగ్గజ టెక్ కంపెనీ గూగులే సైతం తన కోడింగ్‌లో మూడోవంతును ఇప్పటికే 'ఏఐ'కు అప్పగించింది. రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్సింగ్ రంగాలు కూడా ఇదే విధానం పాటిస్తాయి. కాబట్టి ఉద్యోగాలు చాలావరకు కనుమరుగవుతాయని ముఖర్జియా పేర్కొన్నారు.
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడం కూడా.. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అవుతోంది. కాబట్టి జీతం మీదనే బతకాలనే విధానం మార్చుకోవాలి. మనది డబ్బు మీద ఆధారపడిన సమాజం. సక్సెస్ అంటే డబ్బు అనే చాలామంది చెబుతారు. ఇది మారాలి. తల్లిదండ్రులు కూడా.. తమ పిల్లలను ఉద్యోగం తెచ్చుకోవడమే లక్ష్యం అన్నట్టు పెంచకూడదని సౌరభ్ ముఖర్జియా స్పష్టం చేశారు.