
ఫార్మా ఎగుమతులపై అగ్రరాజ్యం ప్రతీకార సుంకాలు
విధించకపోవచ్చంటున్న భారత కంపెనీలు
ఔషధ దిగుమతులపై ఆధారపడినందున పన్నుల వడ్డనపై వెనక్కితగ్గే అవకాశం ఉందని అంచనా
ఒకవేళ ప్రతీకార సుంకాలు విధిస్తే నష్టం ఆ దేశానికే ఉంటుందని స్పష్టికరణ
ఔషధాలు, ఆటోమొబైల్, సెమికండక్టర్ దిగుమతులపై దాదాపు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఔషధ ఎగుమతుల్లో యూఎస్ మార్కెట్ తొలి స్థానంలో ఉంది. అలాగే అమెరికా వినియోగిస్తున్న జనరిక్స్‌లో దాదాపు సగం వాటా భారత్ సమకూరుస్తోంది. దీంతో ట్రంప్ ని ర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఔషధ దిగుమతులపై ఆధారపడ్డ యూఎస్ ప్రతీకార పన్నుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేసే అవకాశమే ఉందని భారతీయ ఫార్మా కంపెనీలు, నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. యూఎస్ వెలుపల అత్యధిక యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ ప్లాంట్లు ఉన్నది భారత్‌లోనే. పైగా ఇప్పటికిప్పుడు డిమాండ్‌కు తగ్గట్టుగా మందులను సరఫరా చేసే స్థాయిలో అక్కడి కంపెనీల సామర్థ్యం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఒకవేళ ఔషధాలపై ప్రతీకార పన్నులు విధిస్తే తమపై ప్రభావం తక్కువేనని, దిగుమతుల భారం యూఎస్‌పైనే ఉంటుందని భారతీయ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ బ్యూరో
ప్రధాన మార్కెట్‌గా యూఎస్..
భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఔషధాల్లో తొలి స్థానంలో ఉన్న యూఎస్ వాటా ఏకంగా 30 శాతంపైనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి రూ.75,385 కోట్ల విలువైన ఔషధాలు యూఎస్‌కు చేరాయి. ఇక యూఎస్ నుంచి భారత్‌కు వచ్చిన మందులు కేవలం రూ.5,199 కోట్ల విలువైనవి మాత్రమే. 2023–24లో భారత్ నుంచి వివిధ దేశాలకు మొత్తం ఔషధ ఎగుమతులు రూ.2,40,887 కోట్లు. ఇందులో జనరిక్ ఫార్ములేషన్స్ (ఫినిష్డ్ డోసేజ్) రూ.1,64,635 కోట్లు. అంతర్జాతీయంగా జనరిక్స్ మార్కెట్ పరిమాణం రూ.39,85,900 కోట్లు. 2030 నాటికి ఇది రూ.68,45,350 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ సమయానికి భారత మార్కెట్ ఎగుమతులతో కలుపుకుని రూ.9,53,150–10,39,800 కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది రూ.4,76,575 కోట్లు.
చవకగా నాణ్యమైన ఔషధాలు..
నాణ్యమైన ఔషధాలను చవకగా తయారు చేయడం భారతీయ జనరిక్ కంపెనీల ప్రత్యేకత. కోట్లాది రూపాయలు వెచ్చించి యూఎస్‌ఎఫ్‌డీఏ అప్రూవల్స్ దక్కించుకున్న కంపెనీలు.. యూఎస్‌లో ఉన్న అపార అవకాశాలను కాదనుకునేందుకు సిద్ధంగా లేరని ఓ కంపెనీ ప్రతినిధి అన్నారు. ఎఫ్‌డీఏ ఆమోదం అంటేనే ప్రతిష్టగా భావిస్తారని అన్నారు. భారతీయ మందుల కారణంగా 2013–2022 మధ్య యూఎస్ ఆరోగ్య రంగం రూ.1,12,64,500 కోట్లు ఆదా చేసిందని నివేదికలు చెబుతున్నాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను తెలిపారు. నూతన, వినూత్న ఔషధాలను యూఎస్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది.
సిద్ధం కావడానికి నాలుగేళ్లు..
యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం కలిగిన తయారీ ప్లాంట్లు భారత్‌లో 650 దాకా ఉన్నాయి. ఈ ధ్రువీకరణ రావాలంటే ప్రమాణాలకు తగ్గట్టుగా ప్లాంటును సిద్ధం చేయడం, ఏఎన్‌డీఏ ఆమోదం, అనుమతులకు నాలుగేళ్లు పడుతుంది. ఇప్పటికిప్పుడు మరో దేశం నుంచి ఔషధాలను దిగుమతి చేసుకుందామని అనుకున్నా యూఎస్‌కు సాధ్యం కాదు. కోవిడ్ మహమ్మారి సమయంలో చైనా, భారత్‌లో ఎఫ్‌డీఏ తనిఖీలు ఆలస్యం అయ్యాయి. దీంతో సరఫరా తగ్గి యూఎస్‌లో ఔషధాల కొరత వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో టారిఫ్‌లు విధించే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. యూఎస్ నుంచి వచ్చే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని భారత్ ఎత్తివేసే చాన్స్ ఉంది. యూఎస్‌లో తయారీ ప్లాంట్లు పెట్టాలన్నా అంత సులువు కాదు. – రవి ఉదయ భాస్కర్, మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్
వినియోగదారులపైనే భారం..
భారత్ నుంచి దిగుమతయ్యే ఔషధాలపై అమెరికా ప్రస్తుతం కేవలం 0.1 శాతం సుంకాన్ని విధిస్తోంది. ఇందుకు విరుద్ధంగా భారత్ 10 శాతం వసూలు చేస్తోంది. యూఎస్ వినియోగిస్తున్న జనరిక్స్‌లో సింహ భాగం భారత్ సమకూరుస్తోంది. భారత్‌లో తయారైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌పై (ఏపీఐ) యూఎస్ ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రతీకార సుంకాలు కొన్ని జనరిక్స్ లాభదాయకతను ప్రభావితం చేయవచ్చు. కానీ ఆ భారాన్ని తుది వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. – శ్రీనివాసరెడ్డి, చైర్మన్, ఆప్టిమస్ గ్రూప్
ఏపీఐ కంపెనీలకు..
సుంకాలు విధిస్తే ఔషధాలు ప్రియం అవుతాయి. ఇదే జరిగితే యూఎస్ ప్రజలపైనే భారం పడుతుంది. అయితే దీని ప్రభావం ఫినిష్డ్ డోసేజ్ కంపెనీలపైనే ఉంటుంది. ఇక ఏపీఐ త యారీ సంస్థలకు మంచి రోజులు రానున్నాయి. భారత కంపెనీల నుంచే వీటి దిగుమతికి యూఎస్ ఆసక్తిగా ఉండడమే ఇందుకు కారణం. ప్రధానంగా ఆంకాలజీ విభాగంలో అవకాశాలు ఎక్కువ. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం ఉన్న కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది. – ఆళ్ల వెంకటరెడ్డి, ఎండీ, లీ ఫార్మా