
జపాన్‌కు చెందిన డైఫుకు కో., లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Daifuku Intralogistics India) తెలంగాణలోని హైదరాబాద్‌లో అత్యాధునిక తయారీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇంట్రాలాజిస్టిక్స్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆటోమేషన్‌లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సుమారు రూ.227 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఈ-కామర్స్, రిటైల్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, ఎఫ్‌ఎంసీజీ వంటి వివిధ రంగాలలో ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేలా హైదరాబాద్‌లోని ఈ ఇన్నోవేషన్ కేంద్రాన్ని కంపెనీ రూపొందించింది. అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీలు, డిజిటల్ టూల్స్, సస్టైనబుల్ పద్ధతులను ఈ కేంద్రం సమగ్రపరుస్తుంది. ఇది 2030 నాటికి భారతదేశ లాజిస్టిక్స్ అండ్ వేర్‌హౌసింగ్ మార్కెట్ 650 బిలియన్ డాలర్లను దాటే అంచనాకు అనుగుణంగా ఉంటుంది.
ఈ గుర్తించదగిన పెట్టుబడి భారతదేశ "మేక్ ఇన్ ఇండియా" దృష్టిని బలోపేతం చేస్తుంది. భారత-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తుంది. అలాగే భారత్‌ను అత్యాధునిక ఇంట్రాలాజిస్టిక్స్ సొల్యూషన్స్‌కు కేంద్రంగా నిలుపుతుంది. భారత్ తమకు అత్యంత వ్యూహాత్మక గ్లోబల్ మార్కెట్‌లలో ఒకటిగా నిలుస్తుందని డైఫుకు కో., లిమిటెడ్ సీఈవో హిరోషి గెషిరో విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కేంద్రం భారత్, జపాన్ మధ్య గల బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుందని డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్ గరిమెళ్ల అన్నారు. డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా సీఈవో అసిమ్ బెహెరా మాట్లాడుతూ ఈ అసాధారణ ఇన్నోవేషన్ పెట్టుబడి భారతదేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన సొల్యూషన్స్‌ను అందించే తమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ఈ కేంద్రం ద్వారా ఇంజినీరింగ్, ఆటోమేషన్, ప్రొడక్షన్ రంగాల్లో 100 మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.