
మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2025-26 సంవత్సరానికి సవరించిన మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల వివరాలు ఇంకా విడుదల కాకపోవడంతో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ), రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మధ్య సంప్రదింపుల తర్వాత సాధారణంగా ఈ రేట్లను ప్రకటిస్తారు.
ప్రస్తుతానికి అయితే బీమా సంస్థలు గత ఏడాది రేట్ల ఆధారంగానే ప్రీమియంలను వసూలు చేస్తున్నాయి. త్వరలో వెలువడే సవరించిన రేట్లు ప్రస్తుతం కంటే ఎక్కువగా ఉంటే బీమా సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉంది. అదే రేట్లు తక్కువగా ఉంటే వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇప్పటికే తన సిఫార్సులను పూర్తి చేసిందని, తదుపరి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఐఆర్‌డీఏఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తొలుత ఈ రేట్లను 2025 మార్చి 31 లోపు విడుదల చేయాలని అధికారులు భావించారు. వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ రేట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. అయితే ఈసారి కొన్ని వాహన కేటగిరీలకు 10-15% ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేత.. కారణం..
గత ఐదేళ్లలో థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు 2-4% వరకు స్వల్పంగా పెరిగాయి. కానీ బీమా సంస్థలు ఈ ఏడాది గణనీయంగా రేట్లను సవరించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పెరుగుతున్న క్లెయిమ్ ఖర్చులు కంపెనీల నష్టాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఇదిలాఉండగా, రోడ్డు ప్రమాద కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం, బాధితుల సామాజిక భద్రతను రక్షించేందుకు కట్టుబడి ఉండాలి. కానీ రేట్ల నిర్ధారణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థల వైఖరిపట్ల కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.