
భారత్‌లో బంగరానికి ఉన్న విలువ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తరాలుగా పసిడి సంపదకు గుర్తుగా ఉంటోంది. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఆరోజు పసిడి కొంటే ఆ ఏడాదంతా సంపద సొంతం అవుతుందని అనుకుంటారు. రేపు అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. అయితే బంగారాన్ని కేవలం నగల రూపంలోనే కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ మార్కెట్‌లో వివిధ మార్గాల ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)
ఫిజికల్ గోల్డ్ సొంతం చేసుకోవాలనే ఇబ్బంది లేకుండా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మంచి ఎంపిక. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్ ధరను ట్రాక్ చేసే ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్. షేర్ల మాదిరిగానే వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారం లేదా దానిలో కొంత భాగాన్ని సూచిస్తుంది. వీటివల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనడం, విక్రయించడం చేయవచ్చు.
ఫిజికల్ గోల్డ్ మాదిరిగా కాకుండా మేకింగ్ ఛార్జీలు లేదా నిల్వ ఖర్చులు ఉండవు. ధరలు నేరుగా బంగారం రేట్లతో ముడిపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా పెట్టుబడికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది. మార్కెట్‌లో చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
డిజిటల్ గోల్డ్ (Digital Gold)
డిజిటల్ గోల్డ్ అనేది భౌతికంగా బంగారాన్ని సొంతం చేసుకోకుండా అందులో పెట్టుబడి పెట్టడానికి ఒక ఆధునిక మార్గం. ఇది ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనడానికి, విక్రయించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసే బంగారానికి సురక్షితమైన వాల్ట్‌ల్లో నిల్వ చేసిన భౌతిక బంగారం మద్దతుగా నిలుస్తుంది. కనీసం రూ.10 నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారం నాణ్యతకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ డిజిటల్ గోల్ట్‌కు బీమా చేసిన వాల్ట్‌ల ద్వారా భద్రత కల్పిస్తారు. దాంతో దొంగతనం జరుగుతుందేమోనని ఆందోళన చెందనవసరం లేదు.
అవసరమైనప్పుడల్లా డిజిటల్ బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ లేదా క్యాష్‌గా మార్చుకోవచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్‌ఫామ్‌లతోపాటు ప్రముఖ బ్యాంకులు ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్‌గోల్డ్ ఆగ్మాంట్ గోల్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ పెట్టుబడులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ గోల్డ్ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు లోబడి ఉంటుంది.
ఇదీ చదవండి: భగ్గుమంటున్న పసిడి ధరలు! తులం ఎంతంటే..
చివరగా.. అప్పు చేసి వద్దు!
అక్షయ తృతీయ మంచి రోజు.. ఏది కొన్నా కలిసి వస్తుందని భావించి అప్పులు చేసి మరీ బంగారం కొనేవారూ ఉన్నారు. కానీ అప్పు చేసి కొంటే రుణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనకపోయినా పర్లేదు.. ఉన్నంతలో ఆ రోజున నలుగురికి సాయపడితే.. అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు! అప్పు మాత్రం చేయకండి.