
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 2022 జనవరిలో రూ.1.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2021 జనవరితో పోల్చితే ఈ విలువ 15 శాతం అధికం. ఎకానమీ రికవరీ, పన్ను ఎగవేతల నిరోధం వంటి అంశాలు దీనికి కారణం. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకటన ప్రకారం 36 లక్షల త్రైమాసిక రిటర్నులు సహా 2022 జనవరి 30 వరకూ దాఖలైన జీఎస్‌టీఆర్–3బీ రిటర్నుల సంఖ్య 1.05 కోట్లు. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
- జీఎస్‌టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లు పైన నమోదుకావడం (ఏప్రిల్, అక్టోబర్,నవంబర్, జనవరి) ఆర్థిక సంవత్సరంలో ఇది నాల్గవనెల. ఇక లక్ష కోట్లు పైబడ్డడం వరుసగా ఏడవనెల. అత్యధికంగా నమోదయిన వసూళ్లు 2021 ఏప్రిల్‌లో కాగా, అటుపై రెండు నెలల్లో సెకండ్‌వేవ్ ఎఫెక్ట్ పడింది.
- జనవరి 31వ తేదీ 3 గంటల వరకూ వసూళ్లను పరిశీలిస్తే, మొత్తం జీఎస్‌టీ రూ.1,38,394 కోట్లలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.24,674 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ రూ.32,016 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.72,030 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.35,181 కోట్లుసహా), సెస్ రూ.9,674 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.517 కోట్లుసహా).