
మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) పథకం 2025 మార్చి 31 నుంచి నిలిపివేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (DEA).. ఎంఎస్‌ఎస్‌సీ పథకం గడువు తరువాత కొనసాగదని అధికారికంగా వెల్లడించింది. కాబట్టి ఇకపై ఈ పథకం కింద కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులకు ఆస్కారం లేదు.
మహిళల ఆర్థిక భద్రతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2023 బడ్జెట్ సమయంలో ఈ ఎంఎస్‌ఎస్‌సీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలు పొదుపు చేసేందుకు ప్రోత్సాహం లభించింది. ఎంఎస్‌ఎస్‌సీ పథకం నిలిపివేయడం వల్ల కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్న మహిళలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. అయితే, మార్చి 31, 2025లోపు ఎంఎస్‌ఎస్‌సీలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం 7.5 శాతం వడ్డీ రేటుతో ప్రయోజనం ఉంటుంది.
ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలు
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం మిస్ అయిన వారు.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు.