
ప్రతి మనిషి తన సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా దాచుకోవాలి. లేకుంటే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాలలో సేవింగ్ చేసుకుంటుంటే.. మరికొందరు పిల్లల చదువులకు, వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి.. ఇలా కొంత పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారికి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్' మంచి ఎంపిక అవుతుంది.
5 సంవత్సరాల్లో 20 లక్షలు ఇలా..
ఐదేళ్లలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ. 20లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 28,100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్లు ఈ పథకంలో డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇది త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా ఉంటుంది. అంటే.. వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ మొత్తం పెట్టుబడిన కొంత పెంచుతుంది.
➤మొత్తం పెట్టుబడి (రూ. 28100 x 60 నెలలు): రూ. 16,86,000
➤మీ పెట్టుబడికి వడ్డీ: రూ. 3,19,382
➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 20,05,382
ఇదీ చదవండి: నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి: ప్లాన్ వివరాలివిగో..
రిస్క్ లేకుండా పొదుపు చేయడానికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమమైన మార్గం. ఈ ప్లాన్‌ను మీరు నెలకు 100 రూపాయల పెట్టుబడితో కూడా ప్రారభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో ఉంటుంది, కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. వడ్డీ రేట్లలో మార్పులు ప్రతి మూడు నెలలకు సమీక్షించబడతాయి. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు అందరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు.