
నగదు .. అంటే కరెన్సీ నోట్లను బ్యాంకు అకౌంటులో జమచేయడం మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి.
» పాన్ నెంబర్ వేయకుండా, అంటే అవసరం లేకుండా ఒక వ్యవహారంలో రూ.50,000 దాటకుండా డిపాజిట్ చేయవచ్చు.
» అలా అని ఒకరోజు మొత్తంలో రూ. 2 లక్షలు దాటి తీసుకోరు.
» ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు డిపాజిట్లు చేసారంటే మీరు జాగ్రత్త పడాలి.
ఈ పరిమితిని ఒక ఆంక్షలాగే భావించాలి. మొదటగా పాన్ నెంబర్ ఇవ్వాలి. అంతేకాకుండా సదరు బ్యాంకు బ్రాంచి ఏ పొదుపు ఖాతాలో నగదుగా రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువగా డిపాజిట్ అయ్యిందో, వారి అకౌంటు వివరాలు... సంవత్సర కాలంలో నగదు మొత్తం ఎంత జమ అయ్యిందో, సమాచారం తెలియజేస్తారు. ప్రతి బ్యాంకుకి వారి వారి పాలసీలు కూడా అమలులో ఉన్నాయి. ఈ క్రింది కేసులు/వ్యవహారాలు గమనించండి.
ఈశ్వరరావు పాలబూత్‌లో కార్డులు, అరువులు కాకుండా రోజూ నగదు రూపేణా రూ.20 వేల అమ్మకాలు ఉండేవి. రోజూ ఉదయం బ్యాంకు తెరవగానే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసేవాడు. ఏడాదికి గాను రూ.72 లక్షలు డిపాజిట్ అయ్యాయి. నోటీసులు వచ్చాయి. నగదుగా చేసిన డిపాజిట్ నుంచి సరఫరా చేసే డైయిరీఫాం వారికి పెద్ద పెద్ద మొత్తాలు చెక్కు/డీడీ రూపంలో చెల్లించేవాడు. డిపాజిట్ చేసిన మొత్తం పాల విక్రయం ద్వారా ఏర్పడింది. కానీ అది నూటికి నూరు పాళ్ళు ఆదాయం కాదు. లాభమూ కాదు. నోటీసులకు జవాబులిచ్చి బయటపడేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. ఇలా కొన్ని వ్యాపారాలు/వృత్తుల్లో ప్రైవేటు హాస్పిటల్స్, సినిమా పరిశ్రమ, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌లో నగదు వస్తుంటుంది. తగిన జాగ్రత్త వహించాలి. అలాగే గుడి, గోపురాల్లో కూడా.
దామోదర్ రెడ్డికి నగరశివార్లలో ఒక పెద్ద కాంప్లెక్స్, 12 ఫ్లాట్లు ఉన్నాయి. అద్దెలు వస్తున్నాయి. వయస్సు పెద్దది. సమయం, ఓపిక లేదు. అందరూ నగదే చెల్లిస్తున్నారు. అందరిని తన పొదుపు ఖాతాలోకి నగదు రూపంలో డిపాజిట్ చేయమనేవాడు. వారందరూ మాట ప్రకారం అకౌంట్లోనే జమచేసేవారు. లక్షల్లో తేలేది అద్దె ఆదాయం. నోటీసులు తథ్యం. అకౌంటు చేయక తప్పలేదు.
వీరభద్రానికి పెద్ద ఇల్లు. నలుగురు పిల్లలు. భారీ సంపాదన. అంతా చెక్కు రూపంలోనే స్వీకరించేవారు. నగదు విత్‌డ్రా చేయడం ఖర్చులన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని నగదు ద్వారా బ్యాంకులో డిపాజిట్ చేసేవారు. ఇలా చేసిన డిపాజిట్లు రూ.10 లక్షల దాటాయి. నోటీసులు... కథా కమామీషు.
👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనా
హస్తవాసి ఉన్న డాక్టర్ ఆనంద్‌రావు ఖాతాలు, ఎన్నో గుళ్లు గోపురాలు ప్రతిష్ట చేసిన బ్రహ్మ గారి ఖాతాలు, లంచాలు లాగి.. లాగి అమాయకంగా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసిన లంచావతారం ఖాతాలు, అదర్శ రైతు అవార్డు పొందిన రైతుగా తన వ్యవసాయ ఆదాయాన్ని బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేసిన నాగయ్య, ఎన్నో ఇళ్లు కట్టిన మేస్త్రిగా మంచి పేరు పొందిన కొండయ్య, బొటిక్ పెట్టి మంచి పేరుతో డబ్బులు సంపాదించి బ్యాంకులో డిపాజిట్ చేసిన రాణి, కేటరింగ్‌తో లక్షలు సంపాదించి నగదు డిపాజిట్ చేసిన శ్రీను.. ఇలా ఎందరో నగదు డిపాజిట్‌దారులు.. ఎన్నెన్నో కథలు.
ప్రయివేటు చిట్టీల్లో వచ్చిన మొత్తాలు... భూములు, పొలాలు, ఇండ్లు అమ్మగా వచ్చిన మొత్తాలు... స్నేహితులు, చుట్టాలు ఇచ్చిన రుణాలు... అప్పులు... ఇలా ఎంతమందినైనా చెప్పవచ్చు. ఎన్నో వ్యవహారాలు ప్రస్తావించవచ్చు. అన్నీ డిపాజిట్ల ఆదాయం కాకపోవచ్చు. సరైన, సమగ్రమైన, సంతృప్తికరమైన వివరణ ఇస్తే బయపడవచ్చు. లేదంటే ఈ డిపాజిట్లలో నగదును ఆదాయంగా భావించే ప్రమాదం ఉంది.
1.4.2024 నుంచి 31.3.2025 మధ్య ఇటువంటి డిపాజిట్లు ఉంటే విశ్లేషించుకోండి. విషయాన్ని బయటపెట్టండి.
::కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.