
న్యూఢిల్లీ: మార్చి నెలకు జీఎస్‌టీ వసూళ్లు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్‌టీ మొదలైన తర్వాత రెండో నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం. 2024 ఏప్రిల్ నెలలో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు ఇప్పటి వరకు నెలవారీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా ఉంది.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్
దేశీ విక్రయ లావాదేవీల రూపంలో ఆదాయం 8.8 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లుగా ఉంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై జీఎస్‌టీ 13.56 శాతం వృద్థితో రూ.46,919 కోట్లకు చేరింది. స్థూలంగా చూస్తే సెంట్రల్ జీఎస్‌టీ కింద రూ.38,145 కోట్లు, స్టేట్ జీఎస్‌టీ కింద రూ.49,891 కోట్లు, ఇంటెగ్రేటెడ్ జీఎస్‌టీ కింద రూ.95,853 కోట్లు, సెస్సు రూపంలో రూ.12,253 కోట్లు చొప్పన మార్చిలో వసూలైంది. ఇక మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.22.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24తో గణాంకాలతో పోల్చి చూస్తే 9.4 శాతం పెరిగింది.
