
టమాట ధరల పెరుగుదల మిగతా నిత్యావసరాల ధరల మీద ప్రభావం చూపుతోంది. కర్ణాటకలో పాల ధరలు కూడా 2023 ఆగష్టు 01 నుంచి పెరగనున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్‌ఎఫ్) బృందం & ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య జరిగిన సమావేశం తరువాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని (Nandini) ధరలు లీటరుకు రూ. 3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న కారణంగా పాల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కెఎమ్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు.
కెఎమ్‌ఎఫ్ చైర్మన్ భీమా నాయక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను ఆమోదించింది. కావున కొత్త ధరలు ఆగష్టు 01 నుండి అమలులోకి రానున్నాయి. ధరల పెరుగుదల కేవలం పాలకు మాత్రమే వర్తిస్తుందని.. పెరుగు, ఇతర పాల పదార్థాలు వర్తించే అవకాశం లేదని తెలిపారు.
(ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 సన్‌రూఫ్ ఫీచర్ కార్లు - వివరాలు)
ప్రస్తుతం మార్కెట్లో నందిని టోన్డ్ మిల్క్ ధర రూ. 39 ఉండగా.. ఆగష్టు 01 నుంచి ఇది రూ. 42కి చేరుతుంది. పాల పొడి ధరలు కూడా పెంచాలన్న బృందం విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ధరల పెరుగుదల వల్ల పాడి పరిశ్రమ కూడా అదనపు ఆదాయాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది.
కర్ణాటక ప్రభుత్వం నియంత్రణలో నడిచే నందిని ఇప్పుడు పాల ధరను పెంచనుండడంతో మిగతా ప్రైవేట్ డెయిరీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. నందిని రూ.3 పెంచితే ప్రైవేట్ కంపెనీలు కనీసం రూ.5 వరకు పెంచే అవకాశం ఉందని అక్కడి వర్గాలు తెలిపాయి.