
దేశంలో అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌ల నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఎకాగ్రహ్ రోహన్ మూర్తి రూ. 3.3 కోట్లు అందుకోనున్నాడు. ఈ బుడ్డోడికి ఇన్ఫోసిస్‌లో 15 లక్షల షేర్లు (0.04% వాటా) ఉన్నాయి. ఎకాగ్రహ్ నాలుగు నెలల వయసున్నప్పుడు నారాయణ మూర్తి బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో ఈ షేర్ల విలువ రూ. 240 కోట్లకు పైగా ఉండేది.
ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్‌ను ప్రకటించింది. దీని ద్వారా ఎకాగ్రహ్‌కు రూ. 3.3 కోట్ల డివిడెండ్ లభించనుంది. ఈ చిన్నారి ఇప్పటివరకు మొత్తం రూ. 10.65 కోట్ల డివిడెండ్‌ను సంపాదించాడు. చిన్న వయసులోనే ఎకాగ్రహ్‌కు రూ.కోట్లలో ఆదాయం లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇన్ఫోసిస్, భారత ఐటీ రంగంలో అగ్రగామిగా ఉంటూ, తన వాటాదారులకు స్థిరమైన డివిడెండ్‌లను అందిస్తోంది. నారాయణ మూర్తి తన మనవడికి ఇచ్చిన ఈ బహుమతి, ఎకాగ్రహ్ భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, కుటుంబ ఆస్తుల పంపిణీలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది. రాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమారుడు రోహన్ మూర్తి, అపర్ణా కృష్ణన్‌ల ముద్దుల కొడుకే ఈ ఎకాగ్రహ్.
ఇక నారాయణ మూర్తి కుమార్తె, యూకే మాజీ ప్రధాని సతీమణి అక్షతా మూర్తికి ఇన్ఫోసస్‌లో 3.89 లక్షల షేర్లు (1.04% వాటా) ఉన్నాయి. దీంతో ఆమె రూ.85.71 కోట్లు అందుకోబోతున్నారు. అలాగే నారాయణ మూర్తి రూ.93.33 కోట్లు, ఆయన భార్య సుధా మూర్తి రూ.76 కోట్లు ఈ డివిడెండ్‌ల ద్వారా ఆర్జించనున్నారు. ఈ డివిడెండ్‌లకు మే 30వ తేదీని రికార్డ్ డేట్‌గా ప్రకటించగా జూన్ 30న ఆయా మొత్తాలు వాటాదారుల చేతికి అందనున్నాయి.