
ఉద్యోగుల మధ్య జీతాల ( salaries ) తేడాల్లేకుండా వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys founder Narayana Murthy) వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ఉద్బోధించారు. కారుణ్య పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించడం ద్వారా తక్కువ, ఎక్కువ అనే వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ కార్యక్రమంలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.
ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టాల్సి ఉందని, ఇందుకోసం ‘ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, వారి లోపాలను చెప్పాల్సినప్పుడు ఏకాంతంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు సంస్థ ఫలాలను కంపెనీ ఉద్యోగులందరికీ న్యాయంగా పంచాలి’ అని నారాయణమూర్తి సూచించారు.
దేశంలోని వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారీ విధానాన్ని కరుణతో స్వీకరించినప్పుడే భవిష్యత్ భారత అభివృద్ధి, పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆయన అన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు భారత్ లోని యువత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మూర్తి గతంలో వారానికి 70 గంటల పనిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు.
టై కాన్ ముంబై 2025లో టై ముంబై మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్ మెహతాతో మాట్లాడిన మూర్తి, ప్రస్తుత సోషలిస్టు మనస్తత్వంలో దేశం అభివృద్ధి చెందదని అభిప్రాయపడ్డారు. "పెట్టుబడిదారీ విధానం అంటే సంపదను సృష్టించడానికి ప్రజలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేలా అవకాశం కల్పించడం. ప్రజలకు ఉద్యోగాలు కల్పించి తద్వారా పేదరికాన్ని తగ్గించడం. పన్నుల ద్వారా దేశ అభివృద్ధికి దోహదం చేయడం" అని మూర్తి వివరించారు.