
హెచ్‌యూఎల్ లాభం రూ.2,475 కోట్లు
షేరుకి రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 3 శాతంపైగా క్షీణించి రూ. 2,475 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 2,561 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం వృద్ధితో రూ. 15,416 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 15,013 కోట్ల అమ్మకాలు సాధించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇబిటా మార్జిన్లు 0.3 శాతం నీరసించి 23.1 శాతాన్ని తాకాయి. మొత్తం వ్యయాలు 3 శాతం పెరిగి రూ.12,478 కోట్లకు చేరాయి.
ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
విభాగాలవారీగా..: క్యూ4లో హెచ్‌యూఎల్ ఆదాయంలో గృహ సంరక్షణ నుంచి 2 శాతం అధికంగా రూ. 5,815 కోట్లు సమకూరింది. సౌందర్యం, పోషక విభాగం 7 శాతం ఎగసి రూ. 3,265 కోట్లుగా నమోదైంది. వ్యక్తిగత సంరక్షణ నుంచి 3 శాతం వృద్ధితో రూ. 2,126 కోట్లు లభించింది. ఆహార విభాగం నామమాత్ర క్షీణతతో రూ. 3,896 కోట్లకు పరిమితమైంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 10,671 కోట్లను తాకింది. ఇక మొత్తం ఆదాయం 2 శాతంపైగా వృద్ధితో రూ. 64,138 కోట్లకు చేరింది.