
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జైడస్ లైఫ్‌సైన్సెస్ ఛైర్మన్ పంకజ్ పటేల్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, పారిశ్రామికవేత్త పవన్ కుమార్ గోయెంకా ఉన్నారు. సుజుకీ మోటర్ మాజీ చీఫ్, దివంగత ఒసాము సుజుకీకి (మరణానంతరం) ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ అందుకున్నారు.
పంకజ్ పటేల్
పంకజ్ పటేల్ దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన జైడస్ లైఫ్ సైన్సెస్ ఛైర్మన్. 1953 మార్చి 16న గుజరాత్‌లో జన్మించిన ఆయన హెల్త్ కేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జైడస్ అధిక కొలెస్ట్రాల్ కలిగిన మధుమేహ వ్యాధిగ్రస్తులకు తొలి భారతీయ ఔషధం లిపాగ్లిన్, దేశంలో మొట్టమొదటి హెచ్ 1 ఎన్ 1 వ్యాక్సిన్ వాక్సిఫ్లూ-ఎస్ వంటి ఉత్పత్తులను అభివృద్ధి చేసింది.

అరుంధతీ భట్టాచార్య
ప్రముఖ భారతీయ బ్యాంకర్, కార్పొరేట్ లీడర్‌గా గుర్తింపు పొందారు. 2013 నుంచి 2017 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన తొలి మహిళ. ఆమె తన పదవీకాలంలో మహిళా ఉద్యోగులకు విశ్రాంతి సెలవులు, సంస్థలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకాలు వంటి విధానాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్ ఇండియా ఛైర్‌పర్సన్, సీఈఓగా ఉన్నారు. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో సహా పలు బోర్డుల్లో పనిచేశారు.

పవన్ కుమార్ గోయెంకా
ఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ వంటి ఐకానిక్ వాహనాల అభివృద్ధికి కృషి చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో పదవీ విరమణ చేసే వరకు మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-స్పేస్) ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..
ఒసాము సుజుకి
ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో సేవలించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, సీఈఓగా పని చేశారు. భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి ద్వారా విప్లవాత్మకమైన పాత్ర పోషించారు. ఇది దేశంలో సరసమైన, నమ్మదగిన వాహనాలకు గుర్తింపుగా మారింది. కంపెనీలో తన నాయకత్వం 1978 నుంచి 2021 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. 1930 జనవరి 30న జపాన్‌లో జన్మించిన ఒసాము సుజుకీ 1958లో సుజుకి మోటార్ కార్పొరేషన్‌లో చేరారు. 2024 డిసెంబర్ 25న తన 94వ ఏట కన్నుమూశారు.
