
న్యూఢిల్లీ: దేశీయంగా ఈస్పోర్ట్స్ బిజినెస్ నిర్వహించేందుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. సొంత అనుబంధ సంస్థ రైజ్ వరల్డ్‌వైడ్ ద్వారా బ్లాస్ట్ ఈస్పోర్ట్స్‌తో ఇందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా జేవీకి తెరతీయనుంది.
రిలయన్స్, బ్లాస్ట్ జత కట్టడం(జేవీ) ద్వారా దేశీయంగా అత్యున్నత ఐపీలను అభివృద్ధి చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో రెండు సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాకుండా అభిమానులు, క్రీడాకారులు, బ్రాండ్ల కోసం బ్లాస్ట్‌కున్న గ్లోబల్ ఐపీలను సైతం దేశీయంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశాయి.
బ్లాస్ట్ ఏపీఎస్(డెన్మార్క్) ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టోర్నమెంట్ నిర్వాహక సంస్థలలో ఒకటికాగా.. గేమ్ పబ్లిషింగ్ గ్లోబల్ దిగ్గజాలు ఎపిక్ గేమ్స్, వాల్వ్, రియట్ గేమ్స్, క్రాఫ్టన్, యూబిసాఫ్ట్ తదితరాలతో కలసి పనిచేస్తోంది. తద్వారా గ్లోబల్ ఈస్పోర్ట్స్ ప్రాపరీ్టలను ఆవిష్కరిస్తోంది.