
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్ (క్రెడిట్ కార్డు సేవల్లోని) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (2025 జనవరి–మార్చి) రూ.534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.662 కోట్లతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గిపోయింది. క్రెడిట్ కార్డులపై రుణ ఎగవేతలు పెరగడం లాభాలకు గండికొట్టింది. మొత్తం ఆదాయం మాత్రం ఇదే కాలంలో రూ.4,475 కోట్ల నుంచి రూ.4,832 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.2,415 కోట్లకు మెరుగుపడింది.
క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,139 కోట్లుగా ఉంది. స్థూల నిరర్థక రుణాలు (వసూలు కాని/ఎన్‌పీఏలు) మొత్తం రుణాల్లో 3.08 శాతంగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 2.76 శాతమే. నికర ఎన్‌పీఏలు గమనించినా.. 0.99 శాతం నుంచి 1.46 శాతానికి పెరిగాయి. నష్టాలు/మొండి బకాయిలకు కేటాయింపులు క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.944 కోట్లుగా ఉంటే, సమీక్షా కాలంలో రూ.1,245 కోట్లకు పెరిగిపోయాయి.
ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ కార్డ్ రూ.1,916 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2023–24లో నమోదైన రూ.2,408 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.17,484 కోట్ల నుంచి రూ.18,637 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాలన్స్ షీట్ విలువ రూ.58,171 కోట్ల నుంచి రూ.65,546 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేరు ధర ఒక శాతానికి పైగా లాభపడి రూ.927 వద్ద ముగిసింది.