
దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసుల ఎగుమతిదారుగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లతోపాటు, కొత్త ప్రాజెక్టుల్లో పని చేసేందుకు నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 26, శనివారం బెంగళూరులో లేటరల్ నియామకాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
మై ఎస్‌క్యూఎల్ డీబీఏ, అజూర్ ఎస్‌ఎంఈ, ఐబీఎం డీబీ2, ఏడబ్ల్యూఎస్ ఎస్‌ఎంఈ, ఒరాకిల్ డీబీఏ, డీబీ2 డిజైనర్ విభాగాల్లో నైపుణ్యాలున్న వారి కోసం టీసీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 15 ఏళ్ల ఫుల్ టైమ్ ఉద్యోగం చేసిన నిపుణుల కోసం కంపెనీ ఈమేరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. విద్య, ఉద్యోగాల మధ్య రెండేళ్లకు మించి గ్యాప్ ఉండకూడదనే షరతు ఉంది.
ఇప్పటికే మార్చి 22న ఐదు నగరాల్లోని టెక్ నిపుణుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించిన టీసీఎస్ తిరిగి నెల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. గతంలో జరిగిన నియామకంలో ఆటోమేషన్ టెస్టర్ (సెలీనియం, కుకుంబర్), జావా డెవలపర్స్ (స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్), ఫ్రంట్ ఎండ్ యాంగులర్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్ (పైథాన్), డేటా సైంటిస్ట్స్ (ఎస్ఏఎస్/ఎస్‌క్యూఎల్), పవర్బీ డెవలపర్, స్నోఫ్లేక్, లీడ్ వెబ్ కాంపోనెంట్ డెవలపర్స్ (యాంగులర్) వంటి వివిధ పోస్టులకు మూడు నుంచి ఆరేళ్ల అనుభవం ఉన్నవారిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, కోల్‌కతాల్లో నియమించుకుంది.
ఇదీ చదవండి: జియో స్టోర్స్‌ల్లో స్టార్‌లింక్ హార్డ్‌వేర్
ఈ ఏడాది జనవరిలో అట్రిషన్(కంపెనీ మారడం) కారణంగా టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గిందని, జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ స్వల్పంగానే ఈ లోటును భర్తీ చేసినట్లు తెలిపింది. మరో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇదే తరహా నియామకాల ప్రక్రియను కొనసాగిస్తుండటంతో టీసీఎస్ నియామకాలు ఊపందుకున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా పైథాన్, డాట్‌నెట్, ఆండ్రాయిడ్/ ఐఓఎస్ డెవలప్‌మెంట్, ఆటోమేషన్ టెస్టింగ్ సహా 40+ నైపుణ్యాలకు సంబంధించిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నట్లు ఇన్ఫోసిస్ గత నెలలో అంతర్గత మెయిల్‌ను పంపించింది.