
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తనకు, దివంగత రతన్ టాటాకు మధ్య 2004లో జరిగిన ఆసక్తికరమైన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో జంషెడ్‌జీ టాటా రూమ్‌ను ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ ఆహ్వానించినప్పుడు రతన్ టాటా ఆశ్చర్యపోయారని మూర్తి చెప్పారు.
ఇన్ఫోసిస్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పోటీదారుగా ఉన్నప్పటికీ తనను ఎందుకు ఆహ్వానించారని రతన్ టాటా అడిగారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రతన్ టాటా టీసీఎస్ సంస్థకు నాయకత్వం వహించేశారు. టాటా సందేహానికి మూర్తి మర్యాదపూర్వకంగా బదులిస్తూ, జంషెడ్‌జీ టాటా కంపెనీలకు అతీతమైనవారని, గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌కు టాటా గ్రూప్‌ను పోటీదారుగా తాను ఎన్నడూ భావించలేదని, రతన్ టాటా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున రూమ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని రతన్ టాటాకు చెప్పారు.

ఇదీ చదవండి: రతన్ టాటా మళ్లీ బతికొస్తే..
తర్వాత టాటా ఆహ్వానాన్ని మన్నించారని, ఈ కార్యక్రమం తనకు జ్ఞాపకంగా మారిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. రతన్ టాటాకు కాస్త సిగ్గుపడే స్వభావం ఉందని, దీంతో అప్పడు సుదీర్ఘ ప్రసంగం చేసే మూడ్‌లో లేరని చెప్పుకొచ్చారు. అయితే రతన్ టాటా పర్యటన తమ టీమ్‌పై చాలా ప్రభావం చూపిందని, ఇన్ఫోసిస్ సిబ్బందితో సమయం గడిపారని మూర్తి గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వినయం, దయ, దేశభక్తి ఉన్న గొప్ప వ్యక్తి అని నారాయణమూర్తి కొనియాడారు.