
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఫోన్ వరుసగా మూడు రోజులు (72 గంటలు) పాటు తెరవకుండా లాక్ అయి ఉంటే స్వయంచాలకంగా రీబూట్ అవుతుంది. ఈ కొత్త భద్రతా ఫీచర్ గూగుల్ ప్లే సర్వీసెస్ (Google Play) తాజా అప్‌డేట్ (వెర్షన్ 25.14)లో అందుబాటులోకి రానుంది.
ఫోన్ పోయినప్పుడు లేదా చోరీ జరిగినప్పుడు యూజర్ డేటా దుర్వినియోగం కాకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. "వరుసగా మూడు రోజులు లాక్ అయి ఉంటే ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది" అని గూగుల్ ప్లే సర్వీసెస్ తాజా అప్‌డేట్ పేర్కొంటోంది. ఫోన్ యాక్సెస్‌ను తిరిగి పొందాలంటే వినియోగదారులు వారి పాస్‌కోడ్‌ను రీఎంటర్ చేయాల్సి ఉంటుంది.
9to5Google నివేదిక ప్రకారం.. ఈ అప్‌డేట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌లు, టాబ్లెట్‌లలో అందుబాటులోకి వస్తోంది. అయితే ఆండ్రాయిడ్ ఆటో, వేర్ ఓఎస్‌పై పనిచేసే డివైజ్‌లు, ఆండ్రాయిడ్ టీవీలకు ఈ అప్‌డేట్ వర్తించదని తెలుస్తోంది. రీబూట్ చేసిన తర్వాత ఫోన్‌ను 'బిఫోర్ ఫస్ట్ అన్‌లాక్' స్థితికి తిరిగి తీసుకురావడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుందని జీఎస్‌ఎంఅరేనా నివేదిక పేర్కొంది. ఈ స్థితిలో ఫోన్ మరింత సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే పాస్‌కోడ్ మాన్యువల్‌గా ఎంటర్ చేసే వరకు ఫింగర్ ప్రింట్ లేదా ఫేసియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండవు.
తాజా వెర్షన్ 25.14 విడుదలకు దాదాపు ఒక వారం సమయం పట్టవచ్చని అంచనా వేయగా, అర్హత ఉన్న అన్ని పరికరాల్లో ఆటో-రీస్టార్ట్ ఫంక్షన్ పూర్తిగా అందుబాటులోకి రావటానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్‌కు ఏ ఆండ్రాయిడ్ వెర్షన్లు అనుకూలంగా ఉంటాయి.. ఈ సెట్టింగ్‌ను డిజేబుల్ లేదా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంటుందా అనే దానిపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
యాపిల్ iOS 18.1 లో ఇలాంటి భద్రతా ఫీచర్ 'ఇనాక్టివిటీ రీబూట్'ను ప్రవేశపెట్టింది. ఇది నాలుగు రోజులపాటు ఇనాక్టివ్‌గా లాక్ ఉండి లాక్ అయిన ఐఫోన్‌లను రీస్టార్ట్ చేస్తుంది. కొత్త భద్రతా ఫీచర్‌తో పాటు తాజా గూగుల్ ప్లే సర్వేసెస్ అప్‌డేట్ మరికొన్ని మెరుగుదలలను తీసుకువస్తోంది. వినియోగదారులు ఇప్పుడు వారి ఫోన్‌లో క్విక్ షేర్ ట్రాన్స్‌ఫర్‌ను అంగీకరించే ముందు కంటెంట్‌ను ప్రివ్యూ చేయవచ్చు. కొత్త ఫోన్‌ను సెటప్ చేయడం, పాత ఫోన్ నుండి డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది.