
భారత ఆర్ధిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇండియా.. జర్మనీ, జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు.
భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని ఇటీవలే వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ GDPకి గణనీయంగా దోహదపడతాయి. అంతే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక విధానాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇలా..
➤యునైటెడ్ స్టేట్స్ (యూఎస్): 30.507 ట్రిలియన్ డాలర్లు
➤చైనా: 19.231 ట్రిలియన్ డాలర్లు
➤జర్మనీ: 4.744 ట్రిలియన్ డాలర్లు
➤భారతదేశం: 4.187 ట్రిలియన్ డాలర్లు
➤జపాన్: 4.186 ట్రిలియన్ డాలర్లు
➤యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే): 3.839 ట్రిలియన్ డాలర్లు
➤ఫ్రాన్స్: 3.211 ట్రిలియన్ డాలర్లు
➤ఇటలీ: 2.422 ట్రిలియన్ డాలర్లు
➤కెనడా: 2.225 ట్రిలియన్ డాలర్లు
➤బ్రెజిల్: 2.125 ట్రిలియన్ డాలర్లు