
రూ. 4.5 వేల కోట్ల ఆదాయానికి గండి
ఇక్రా అంచనా
న్యూఢిల్లీ: టారిఫ్‌ల వల్ల ఎగుమతులు మందగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాలు సుమారు రూ. 4,500 కోట్ల మేర క్షీణించవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 3 లక్షల కోట్లుగా పరిశ్రమ ఆదాయం నమోదైందని, ఒకవేళ టారిఫ్‌ల వివాదం వల్ల అమెరికాకు ఎగుమతులు మధ్యస్త–గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో క్షీణించిన పక్షంలో 2025–26లో ఆదాయ వృద్ధి 6–8 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది.
గతంలో ఇది 8–10 శాతంగా ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. భారీ టారిఫ్‌ల వల్ల సరఫరా వ్యవస్థపై అదనంగా రూ. 9,000 కోట్ల భారం పడుతుందని, దీన్ని అమెరికా వినియోగదారులు, అక్కడి దిగుమతిదారులు, భారతీయ ఎగుమతిదారులు భరించాల్సి వస్తుందని వివరించింది. సరఫరాదారు ప్రాధాన్యత, పోటీ, సాంకేతిక ప్రాధాన్యత అంశాలను బట్టి వారు ఎంత మేర భారాన్ని బదలాయించగలరనేది ఆధారపడి ఉంటుందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షంషేర్ దివాన్ తెలిపారు.
ఒకవేళ అదనపు టారిఫ్ వ్యయాల్లో 30–50 శాతాన్ని భారతీయ ఆటో విడిభాగాల ఎగుమతిదారులు భరించే పక్షంలో సుమారు రూ. 2,700–4,500 కోట్ల భారం మోయాల్సి వస్తుందని వివరించారు. ఇది పరిశ్రమ నిర్వహణ లాభాల్లో 3–6 శాతమని, ఆటో విడిభాగాల ఎగుమతిదార్ల నిర్వహణ లాభాల్లో 10–15 శాతం అని పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మొత్తం ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 8 శాతంగా నమోదైంది.
2020–24 మధ్య కాలంలో అమెరికాకు ఆటో విడిభాగాల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 15 శాతం స్థాయిలో పెరిగాయి. ఇంజిన్లు, ఎలక్ట్రికల్ కాంపొనెంట్లులాంటి కీలకమైన ఆటోమొబైల్ విడిభాగాలపై మే 3 నుంచి అమల్లోకి వచ్చేలా అమెరికా 25 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే విడిభాగాల్లో దాదాపు 65 శాతం కాంపొనెంట్లు 25 శాతం టారిఫ్‌ల కేటగిరీలోకి వస్తాయి.