
2025–26లో 6.3 శాతానికి తగ్గింపు
ప్రకటించిన ప్రపంచ బ్యాంక్
గత అంచనా 6.7 శాతం
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) తగ్గిస్తున్నట్టు ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. 6.7 శాతం వృద్ధి నమోదు కావచ్చన్న గత అంచనాలను 6.3 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక బలహీనత, విధానపరమైన అనిశి్చతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
‘‘2024–25లో భారత వృద్ధి రేటు నిరాశపరిచింది. ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ మూలధన వ్యయాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం ఇందుకు దారితీసింది. భారత జీడీపీ వృద్ధి 2024–25లో ఉన్న (అంచనా) 6.5 శాతం స్థాయి నుంచి 2025–26లో 6.3 శాతానికి నిదానించొచ్చు.
ప్రైవేటు పెట్టుబడులు, ద్రవ్యపరమైన సడలింపులు, నియంత్రణ పరమైన సానుకూలతలను.. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీనత, విధానపరమైన (వాణిజ్యం) అనిశి్చ తులు తటస్థం చేయొచ్చు’’అని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వివరించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం భారత జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతంలో వేసిన 6.5% నుంచి 6.2 శాతానికి తగ్గించడం గమనార్హం.
‘‘పన్ను తగ్గింపులతో ప్రైవేటు వినియోగం పుంజుకోవచ్చు. ప్రభుత్వ మూలధన వ్యయాలు కూడా పెరుగుతాయి. కానీ, అంతర్జాతీయంగా వృద్ధి నిదానించడం, వాణిజ్య విధానాల్లో మార్పులతో ఎగుమతుల డిమాండ్ తగ్గుతుంది’’అని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి దక్షిణాసియా వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని పేర్కొంది. 2025లో దక్షిణాసియా ప్రాంతంలో 6.1 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను 5.8 శాతానికి కుదించింది.