
‘తమ్ముళ్ల’ బెట్టింగ్ !
● ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులో కూటమి నేతలు ● రోజుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్న వైనం ● బెట్టింగులు వద్దంటూ ప్రకటనలకే పరిమితమైన పోలీసులు
పోలీసుల మౌనం..
బెట్టింగులను అరికట్టడంలో చిత్తూరు నగర పోలీసులు ఏ మాత్రం దృష్టి సారించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకు రూ.లక్షల్లో జరుగుతున్న ఈ జూదంలో చాలా మంది ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. తేనబండకు చెందిన ఓ యువకుడు గత రెండు సీజన్లలో బెట్టింగులు నిర్వహించి రూ.కోటి వరకు పోగొట్టుకుని.. ఇళ్లు కూడా అమ్ముకున్నాడు. ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుని, బెట్టింగుల జాడ కనిపెట్టాల్సిన పోలీసులు మౌనం వహిస్తున్నారు. దీనికితోడు స్పెషల్‌బ్రాంచ్ విభాగానికి చెందిన పోలీసులు సైతం బెట్టింగుల వ్యవహారంలో సమాచారాన్ని సేకరించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కూటమి పార్టీకి చెందిన నేతల అండదండలు ఉండటం వల్లే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దొంగ సొమ్ములో వాటాలు వేసుకుని రూ.లక్షలు కొల్లగొట్టడంలో కొందరు ఖాకీలు చూపించే శ్రద్ధ.. జూదాన్ని నివారించడంపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు అర్బన్ : నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ చాపకింద నీరులా సాగుతోంది. బెట్టింగ్ వ్యవహారం మొత్తం కూటమి పార్టీకి చెందిన కొందరు వ్యక్తుల కనుసన్నల్లో నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చెబుతున్న పోలీసులు మాత్రం.. ఈ ముఠాలపై నిఘా ఉంచి, చట్టపరంగా ముందుకు వెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ –2025 క్రికెట్ మ్యాచ్ సీజన్ ఇటీవల ప్రారంభమయిన విషయం తెలిసిందే. మార్చి 22న ప్రారంభమైన సీజన్–18లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మేనెల 25న జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఇంకా 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి బెట్టింగులు చేసే వారిపై, బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న బెట్టింగుల వ్యవహారాన్ని మాత్రం కట్టడిచేయడంలో విఫలమతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాల్..బాల్‌కు ఓ రేటు
చిత్తూరు నగరంలో ఐపీఎల్ బెట్టింగుల జోరు విచ్చలవిడిగా జరుగుతోంది. ప్రధానంగా నగరంలోని మిట్టూరు, గంగనపల్లె, సంతపేట, కొంగారెడ్డిపల్లె, గిరింపేట, కాజూరు, నాయుడు బిల్డింగ్స్, మార్కెట్ చౌక్, తేనబండ, వన్నియర్‌బ్లాక్, కట్టమంచి, రామ్‌నగర్ కాలనీ, కన్నయ్యనాయుడు కాలనీ ప్రాంతాల్లో బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. స్థానికంగా ప్రముఖ యువకులు ఈ బెట్టింగులను నిర్వహిస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వేసే టాస్ నుంచి ప్రతి ఒక్క ఓవర్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు కాస్తూ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. బాల్ బాల్‌కు రేటు మారుతూ పోతోంది. పందెం కాసే వారి నుంచి రూ.10 వేలకు రూ.2 వేలు కమీషన్ తీసుకుని ఈ జూదాన్ని నడిపిస్తున్నారు. ఇందులో ఏ ఒక్కరిని కదిపినా.. తనకు అధికారపార్టీ నేతల అండదండలు ఉన్నాయని బహిరంగంగానే చెప్పుకుని తిరుగుతున్నారు. దీంతో ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది.