
గోల్డ్ కుంభకోణంలో కీలక నిందితుడి అరెస్టు
పలమనేరు: పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో బంగారు ఆభరణాల మోసం కేసుకు సంబంధించిన కుంభకోణంలో అసలు నిందితుడిని పలమనేరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా కనకదుర్గ ఫైనాన్స్ పేరిట బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఇందులో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది కలసి బంగారు నగల విషయంలో అక్రమాలు జరిగి రూ.కోట్లలో మోసాలు జరిగాయి. దీనిపై సాక్షి దినపత్రికలో పలు కథనాలు వెలువడ్డాయి. కాగా దీనిపై స్థానిక పోలీసుల పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నరసింహులు న్యాయవాదుల ఆధ్వర్యంలో పలమనేరులోని కోర్టులో లొంగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు నిందితుడిని విచారించేందుకు పిటిషన్ వేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేసి ఈ కుంభకోణంలో మొత్తం నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని సీఐ నరసింహరాజు తెలిపారు. ఇలా ఉండగా స్థానిక పోలీసులు నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళుతుండగా బాధితులు పెద్ద సంఖ్యలో నిందితుని పై దాటికి ప్రయత్నం చేయడం గమనార్హం. దీనిపై స్థానిక సీఐ నరసింహరాజును వివరణ కోరగా కనకదుర్గ ఫైనాన్స్ కుంభకోణంలో కీలక నిందితుడిని కోర్టు ద్వారా విచారణకు తీసుకున్న విషయం నిజమేనని, దీనిపై పూర్తి విచారణ పూర్తి చేశాక వివరాలను తెలుపుతామని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కుప్పంరూరల్: మండలంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెండుగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామానికి చెందిన ఎం.ముత్తు తన స్నేహితుడు శేఖర్‌తో కలిసి కూలీ పనుల కోసం మల్లానూరు గ్రామానికి బయలుదేరాడు. శేఖర్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, మార్గం మధ్యలోని ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ల వద్ద ద్విచక్ర వాహనం బ్రేక్ కొట్టడంతో వెనుక వైపు కూర్చున్న ఎం.ముత్తు (28) అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొన్నాడు. ప్రమాదంలో శేఖర్ సురక్షితంగా బయటపడగా, ఎం.ముత్తు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ బాలక్రిష్ణను అదుపులోకి తీసుకుని, ముత్తు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు ఎం.ముత్తుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
జారిపడి వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్: తాగి ఇంట్లో జారి పడిన వ్యక్తి తలకు తీవ్రగాయాలై మృతి చెందిన ఘటన శుక్రవారం చిత్తూరు నగరంలోని చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. యాదమరి మండలం ముత్తురామాపురానికి చెందిన తులసికుమార్(40) అనే వ్యక్తి న్యూ బాలాజీ కాలనీలో నివాసిస్తున్నాడు. భార్య ఊరెళ్లడంతో తులసికుమార్ మద్యం సేవించి తూగుతూ ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన వ్యక్తి టైల్స్‌పై జారి పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే మృతి చెందడంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టూటౌన్ ఎస్‌ఐ బలరామయ్య తెలిపారు. కాగా ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గోల్డ్ కుంభకోణంలో కీలక నిందితుడి అరెస్టు