
ప్రైవేటు చేతికి అస్త్రం
● వాహనాల ఫిట్‌నెస్ పరీక్ష ప్రైవేటు పరం ● జిల్లాలో ప్రత్యేకంగా టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు ● ప్రభుత్వ ఆదాయానికి గండి ● వాహనాల పరీక్షలపై అనుమానాలు
కాణిపాకం : ప్రభుత్వ సేవల్లో అత్యంత ప్రధానమైన, ప్రజలకు ఉపయోగకరమైన సేవలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రక్రియ జరుగుతోంది. రైల్వే శాఖలో పలు సేవలను ఇప్పటికే ప్రైవేటుకు అప్పగించారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఇందులో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బదిలీ విధానం వేగంగా సాగిపోయింది.
ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ మంజూరైంది. ఇప్పటి వరకూ రవాణా శాఖ ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు, ఇకపై లైట్, హెవీ మోటార్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ప్రైవేటు సంస్థ మాత్రమే జారీ చేస్తుంది. ఈ సంస్థపై స్థానికంగా ఎవ్వరి అజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షిస్తుంది.
సర్టిఫికెట్ల జారీ
జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల వాహనాలు 3,67,008 ఉన్నాయి. వీటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా ఒక్కో జిల్లా నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూరేది. దీనిని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ఆ మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కేంద్ర ట్రాన్స్‌పోర్ట్ ఇండియా సలహా మేరకు వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ కోసం వసూలు చేసిన సొమ్మును ఫిట్‌నెస్ స్టేషన్లు రెండేళ్ల పాటు తమ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించనక్కరలేదు. ఈ మేరకు టెండరలలో నిబంధన పెట్టారని చెబుతున్నారు.
బంగాపాళ్యం వద్ద టెస్టింగ్ స్టేషన్..
జిల్లాకు సంబంధించి బంగారుపాళ్యం మండలం మహాసముద్రం టోల్‌గేట్ సమీపాన సుమారు రూ.4.5 కోట్లతో వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ప్రారంభానికి నోచుకోనుంది. ఈ స్టేషన్‌లో మెషీనరీతో పాటు 21 మంది సిబ్బంది పనిచేయనున్నారు. వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు, సర్టిఫికెట్ల జారీ ఇక్కడే జరుగుతాయి. సిబ్బందిని సైతం సంబంధిత ప్రైవేటు ఏజెన్సీ నియమించుకుంటుంది. ఇందులో రాష్ట్ర రవాణాశాఖ అధికారుల ప్రమేయం కాని, అజమాయిషీ కానీ ఏమాత్రం ఉండదు.
పారదర్శకత ప్రశ్నార్థకం
వాహనాల ఫిట్‌నెస్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. అప్పుడే ప్రమాదాల నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం. అన్నీ ప్రైవేటు వ్యక్తులే చేస్తుండటంతో పారదర్శకతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా టెస్టులు నిర్వహిస్తే మంచిదేనని, తమకు ఎవరూ నియంత్రించలేరంటూ ఎలాపడితే అలా చేస్తే ప్రమాదాలు తప్పవని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి..ఈ టెస్టులో మార్పులు చేసి పారదర్శకతను జోడించాలని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని వాహన వివరాలు..
ఫిట్‌నెస్ టెస్ట్ ఇలా..
రోడ్లపై తిరిగే ప్రైవేటు బస్సులు, కార్లు, క్యాబ్, ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ వాహనాలు, ట్యాంకర్లు, స్కూల్ బస్సుల వంటి ప్రతి వాహనానికీ ఫిట్‌నెస్ టెస్టులు తప్పనిసరి, పసుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే ట్రాన్స్‌పోర్ట్, తెలుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే నాన్– ట్రాన్స్‌పోర్టు వాహనాలుగా పరిగణిస్తారు. కొత్త వాహనానికి లైఫ్ టైంలో మొదటి ఎనిమిదేళ్లలో ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్ టెస్ట్ చేయించాలి. ఎనిమిదేళ్ల తర్వాత ఏడాదికోసారి ఈ పరీక్ష తప్పనిసరి. 15 ఏళ్లకు కండిషన్ చూసి, ఆపేయాలి, స్కూల్ బస్సులకు 15 ఏళ్ల వరకే ఫిట్‌నెస్ చూస్తారు. తర్వాత వాటిని స్కూల్ బస్సుల కింద వాడకూడదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో వాహన తనిఖీలు ఎంత వరకూ సక్రమంగా జరుగుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో రవాణాశాఖ కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్షలు ప్రహసనంగా జరిగేవి, కొందరు. అధికారులు మామూళ్లు దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. దీంతో, ప్రమాదాలు చోటు చేసుకునేవి. ప్రధానంగా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరిగేవి. ఇప్పుడు ప్రైవేటు చేతిలో పెడితే అటువంటి పరిస్థితులే ఎదురైతే ఎలాగనే ప్రశ్న వాహనదారులు, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ప్రైవేటు ఏజెన్సీపై పర్యవేక్షణకు జిల్లాలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.