
వేసవి సెలవులు.. దొంగలతో జాగ్రత్త
చిత్తూరు అర్బన్ : పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో.. విహార యాత్రలు, ఊర్లకు వెళ్లే ప్రజలు ఇంట్లో చోరీలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో కోరారు. ఎవరైనా బయటి ప్రాంతాలకు వెళితే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలా చేస్తే తాళం వేసిన ఇళ్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. అలాగే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) ద్వారా కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు. దీనికితోడు జిల్లా వ్యాప్తంగా 16,500 స్మార్ట్ డోర్ లాక్స్ సైతం పంపిణీ చేశామన్నారు. ఎవరైనా బయటి ఊర్లకు వెళితే ఫోన్ 112, పోలీసు వాట్సాప్ 94409 00005 నంబర్లకు తప్పనిసరిగా సమాచారం ఇచ్చి, పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.
28 నుంచి వేసవి శిక్షణ తరగతులు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని గ్రంథాలయాల నందు ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు డిప్యూటీ గ్రంథాలయాధికారి లలిత తెలిపారు. పుస్తక పఠనం, పుస్తక సమీక్ష, కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్స్, డాన్స్, చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఊపందుకున్న ‘గుజ్జు’ పరిశ్రమలు
● కేరళ నుంచి ‘మామిడి’ దిగుమతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు జిల్లాలో కొన్ని మామిడి గుజ్జు పరిశ్రమలు తెరుచుకున్నాయి. అప్పుడే గుజ్జు తయారీని మొదలుపెట్టాయి. జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలుండగా... నాలుగు పరిశ్రమలు గుజ్జు తయారీని ప్రారంభించాయి. కేరళ నుంచి అల్పోన్సో రకం కాయలను దిగుమతి చేసుకుంటున్నాయి. గుజ్జు తయారీని ఆచితూచి చేస్తున్నాయి. ఇలా నిత్యం 90 టన్నుల వరకు దిగుమతి అవుతున్నట్లు పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా జిల్లాలో గతేడాది మామిడి గుజ్జు 2.75 లక్షల టన్నుల తయారీ చేసి నిల్వ చేశారు. యుద్ధాలు, ఇతర కారణాల వల్ల గుజ్జు నత్తనడకన అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం వరకు అమ్ముడుపోయిందని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. పరిశ్రమదారులు పట్టుబట్టి విదేశాల ఎగుమతిపై దృష్టి పెట్టారు. దీని కారణంగా గుజ్జు ఎగుమతులు కదులుతున్నాయి.
టెక్నాలజీతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
తిరుపతి సిటీ: టెక్నాలజీని సంస్కృత శాస్త్రాలలో విరివిగా వినియోగించుకుని విద్యార్థులు జ్ఞానాన్ని పొందాలని వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి సూచించారు. వర్సిటీలో జాతీయ సంస్కృత వర్సిటీ, సీడాక్ సంస్థ సంయుక్తంగా ఏఐ, ఎంఎల్, క్వాంటం కంప్యూటింగ్, ఐకేఎస్‌పై రెండు రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని ఆధునిక సమాజానికి అందించాలంటే టెక్నాలజీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణప్రపూర్ణ, విభాగాధిపతి ప్రొఫెసర్ గణపతి భట్, ప్రొఫెసర్ రమాశ్రీ, డాక్టర్ జానకి, ప్రొఫెసర్ చంద్రశేఖరం, శ్రీధర్, నాగలక్ష్మీ, ప్రసన్న పాల్గొన్నారు
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,828 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,165 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

వేసవి సెలవులు.. దొంగలతో జాగ్రత్త