
జర్నలిస్టులకు రక్షణేదీ?
చిత్తూరు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకు రక్షణ కరవయ్యిందని, రాష్ట్రంలోని జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం.. భౌతిక దాడులకు పాల్పడటం పరిపాటిగా మారిందని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు లోకనాథన్ పేర్కొన్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిలా అధ్యక్షుడు లోకనాథన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని వేధింపులు తాళలేక టీడీపీకి చెందిన దంపతులు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే.. ఆ వార్త రాసినందుకు సాక్షి కార్యాలయంపై దాడి చేయడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చేస్తూ.. పాత్రికేయ రంగాన్ని భయపెట్టాలని చూడాలనుకోవడం అవివేకమన్నారు. ఈ దాడులకు పాల్పడ్డ కూటమి నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పాత్రికేయులపై దాడులు జరగకుండా జర్నలిస్టుల రక్షణ కోసం కమిటీను ఏర్పాటు చేసి, దుండగులను శిక్షించే కొత్త చట్టాలను చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుని, జర్నలిస్టులకు రక్షణ కల్పించడానికి అసెంబ్లీలో చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఇషార్ అహ్మద్ మాట్లాడుతూ.. వార్త నచ్చకుంటే ఖండించాలని, వివరణ ఇవ్వాలని.. ఇలా భౌతికంగా దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌బాబు, కాలేశ్వరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్వి మురళీకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్‌కుమార్, చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు శివప్రసాద్, పవన్‌కుమార్, గంగాధర నెల్లూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తిరుమలయ్య, జిల్లా సీనియర్ జర్నలిస్టులు హేమంత్‌కుమార్, శివకుమార్, వీర రాఘవులు నాయుడు, బాలసుందరం, హరీష్, రాజేష్, శ్రీనివాసులు, చిన్న, చంద్రప్రకాష్ పాల్గొన్నారు.
‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
దాడులకు పాల్పడడంపై మండిపడిన సంఘాలు
చిత్తూరులో కదం తొక్కిన పాత్రికేయులు