
నాబిడ్డకంటే పార్టీ ముఖ్యం కాదు
● జిల్లా ఆస్పత్రిలో అందని వైద్యం ● వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకండి ● న్యాయం జరిగేంత వరకు రాజీలేని పోరాటం చేస్తా ● బీసీ నాయకుడు షణ్ముగం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ‘చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిన్న జబ్బు అయినా ఆ ఆస్పత్రికి వెళ్లొద్దు’ అని బీసీ సంఘం, టీడీపీ నాయకుడు షణ్ముగం తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని బీసీ సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్కడి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ శ్రీదుర్గ మృతి చెందిందని ఆరోపించారు. బిడ్డ మృతికి అక్కడి వైద్యులే కారకులన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు, మెడికల్ కౌన్సిల్, రాష్ట్ర వైద్యఽశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కానీ పక్షంలో ప్రాణత్యాగానికై నా సిద్ధమన్నారు. నా బిడ్డకంటే పార్టీ ముఖ్యం కాదని వివరించారు. సోమవారం నుంచి ప్రజాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి ఆశయం నీరుగారిందన్నారు. చిన్న జబ్బు వచ్చినా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకండని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ నాయకులు రవీంద్రరాజు, రుద్రయ్య ప్రతాప్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నాయకులు శోభారాణి, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.