
భీమదేవరపల్లి: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ, తరచూ ఫోన్‌లో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థిని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నమిండ్ల చంద్రమౌళి–విజయ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
చిన్న కూతురు శ్వేత (18) డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మీసాల వంశీ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నా నంటూ వెంటపడుతున్నాడు. ఫోన్‌లో ఇబ్బందు లకు గురిచేస్తున్నాడు. ఈనెల 24న వంశీతోపాటు అతని స్నేహితుడు మాడ్గల జగదీశ్ ఎవరూలేని సమయంలో శ్వేత ఇంటికి వచ్చి ప్రేమించా లంటూ గొడవ పడ్డారు. అదే సమయంలో తండ్రి చంద్రమౌళి ఇంటికి రావడాన్ని గమనించి వారు వెళ్లిపోయారు.
దీంతో మానసిక వేదనకు గురైన శ్వేత శనివారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు లేని విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో చూడగా అందులో మృతదేహం కనపడింది. మృతురాలి తండ్రి చంద్రమౌళి ఫిర్యాదుతో వంశీ, జగదీశ్‌పై కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.