రాజమండ్రి జైలు చూశారా? ఎంతలో ఎంత మార్పు.? | Education made them students, not prisoners, Look at Rajamundry jail | Sakshi
Sakshi News home page

జైలు పక్షులు కాదు వీరు.. చదువుకుంటున్న విద్యార్థులు @ రాజమండ్రి

Published Thu, Apr 6 2023 2:32 AM | Last Updated on Fri, Apr 7 2023 4:46 PM

- - Sakshi

(డెస్క్‌–రాజమహేంద్రవరం): చదువు దారి చూపుతుంది. దారి తప్పిన వారిని సన్మార్గంలోనూ నడుపుతుంది. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలోని కొందరు ఖైదీల గురించి తెలుసుకుంటే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో.. క్షణికావేశంలో కొందరు నేరానికి పాల్పడుతుంటారు. వీరంతా జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడి కారాగారం అధికారులు మాత్రం వీరి శిక్షను శిక్షణగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా వీరిలో విద్యావెలుగులు నింపుతున్నారు. జైలులో జీవితం వృథా కాకుండా ఖైదీలను విద్యాబాట పట్టిస్తున్నారు. పరివర్తన దిశగా అడుగులు వేయిస్తున్నారు.

ఆగిన చదువకు నడక

సెంట్రల్‌ జైలుకు రాకమునుపు ఆపేసిన విద్యను చాలామంది ఇక్కడికి వచ్చాక కొనసాగించగలుగుతున్నారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా వీరంతా పట్టభద్రులవుతున్నారు. కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్‌ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 135 మంది డిగ్రీ చదువుతుండగా 87మంది ఎంఏ చదువుతున్నారు. 638 మంది ఇప్పటికే డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరికోసం జైలు ప్రాంగణంలోనే పరీక్ష సెంటరు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌గా వీరికి క్లాసులు చెప్పడానికి ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకుంటున్నట్లు సెంట్రల్‌ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజకుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద వయసుండీ నిరక్షరాస్యులైన ఖైదీలకు సైతం రాయడం చదవడం నేర్పుతున్నారు. ప్రస్తుతం 28మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అనంతలక్ష్మి అనే టీచరు బోధిస్తున్నారు.

అబ్బురపరిచే లైబ్రరీ

ఖైదీలు చదువుకునేందుకు లైబ్రరీ ఉంది. ఇందులో 4,300 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు..ఆధ్మాత్మిక భావన కలిగించేందుకు దోహదపడే పుస్తకాలు ఉన్నాయి. లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జైలు అధికారులు కొనుగోలు చేశారు. చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఒక సెంటరును నిర్వహిస్తున్నారు. వెల్డింగ్‌..ప్లంబింగ్‌ కోర్సులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. ఖరీదైన శిక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 30 మంది వంతున ఖైదీలు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారు.

గోల్డు మెడలిస్టులూ ఉన్నారు

సెంట్రల్‌జైలులో శిక్షను అనుభవిస్తూ పట్టభద్రులైన కొందరు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. షేక్‌ అజారుద్దీన్‌ బీఏలో స్వర్ణ పతకాన్ని సాధించారు. షేక్‌ సుభానీ ..టి వెంకటేశ్వరరావులు కూడా ఇదీ డిగ్రీలో గోల్డు మెడల్‌ సాధించారు. విజయవాడకు చెందిన జీ విజయరామ్‌ జైలులోనే పీజీ చదివి విడుదలయ్యాక వీఆర్‌ఓ ఉద్యోగాన్ని పొందారు. సారేపల్లి శ్రీనివాస్‌ మూడు డిగ్రీలు చదివారు. రంపచోడవరానికి చెందిన శ్రీనివాస్‌ కూడా మూడు పీజీలు చేశారు.

ఇక్కడ పీజీ చదివాను

మాది గుంటూరు. 30సంవత్సరాలుగా ఇక్కడ జైలులో ఉంటున్నాను. జైలుకు రాకమునుపు కరస్పాండెన్స్‌ కోర్సు డిగ్రీ చేయాలనుకున్నాను. ఇక్కడకు వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ఎంఏ చదివాను. ఇక్కడి అధికారుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు వచ్చింది. చదవడం వల్ల చాలా తెలుసుకున్నాను. విద్య మనిషిలో సత్‌ప్రవర్తనను పెంచుతుందని గ్రహించాను. విడుదల కోసం ఎదురుచూస్తున్నాను.

– గంటెల విజయవర్దన్‌


మూడు ఎంఏలు చేశాను

మాది రంప చోడవరం. నేను జైలుకు వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. ఓ హత్య కేసులో నాకు శిక్ష పడింది. జైలుకు వచ్చే ముందు ఎమ్మెస్సీ బీఈడీ చదివాను. ఇప్పుడు మూడు ఎంఏలు చేశాను. పాలిటిక్స్‌..పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌..సోషియాలజీలతో ఈ పీజీలు చదివాను. ఈ శిక్షా కాలం నా జీవితంలో ఊరికే పోలేదని భావిస్తున్నాను. జైలు అధికారుల తోడ్పాటుతో మళ్లీ చదువుకోగలిగాను. చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమూ పొందగలుగుతుండటం నాకు సంతోషం కలిగిస్తోంది.

– శ్రీనివాస దొర

పరివర్తనే ధ్యేయంగా..

ఖైదీలలో పరివర్తనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. శిక్షాకాలంలో విద్య లేదా నైపుణ్య కోర్సు నేర్చుకునో బయటకు వెళ్లాక ఉపాధిబాట పట్టేలా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించి అనుసరిస్తున్నాం. మళ్లీ నేరాల వైపు మనసు మళ్లకుండా ఉద్యోగం లేదా ఉపాధి వైపు దృష్టి పెట్టాలనేది మా అభిమతం. అందుకే జైలులో శిక్షాకాలం వృథా కానీయడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు మంచి సహకారం లభిస్తోంది. ఖైదీలు చదువుకోడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిని ఉత్సాహపరిచేలా సహకారం అందిస్తున్నాం. – రాజారావు, జైలు సూపరింటెండెంట్‌

ఖైదీలకు నీతి కథ వివరిస్తున్న                               డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజకుమార్‌1
1/5

ఖైదీలకు నీతి కథ వివరిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజకుమార్‌

ఖైదీలు వివిధ కోర్సులు చదివేది ఇక్కడే2
2/5

ఖైదీలు వివిధ కోర్సులు చదివేది ఇక్కడే

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement