
జగన్‌ను కలిసిన జగ్గిరెడ్డి
కొత్తపేట: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా నూతన అధ్యక్షుడిగా జగ్గిరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జగ్గిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్‌ను కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. తనను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా.. ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వంపై పోరాడదాం, ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు కృషి చేద్దాం, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలన్నీ విజయవంతం చేసేందుకు ఉత్సాహంగా పనిచేయండని జగన్ సూచించారు.
ఓటు నమోదుకు అవకాశం
అమలాపురం రూరల్: జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని జిల్లా రెవెన్యూ అధికారి బీల్‌ఎన్ రాజకుమారి తెలిపారు. ఆమె మంగళవారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కొత్తగా ఓటు హక్కు పొందాలంటే జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండిన వారికే అవకాశం ఉండేదన్నారు.
ఎన్నికల సంఘం ఆ నిబంధనను సడలించి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఒకటో తేదీ నాటికి అర్హత కలిగిన యువతకు ఓటు నమోదుకు అవకాశం కల్పిచిందన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా రాజకీయ పార్టీలు సహకారం అందించాలన్నారు. మీసేవా కేంద్రాలతో పాటు స్మార్ట్ ఫోన్లలోనూ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు దూరి రాజేష్, వడ్డి నాగేశ్వరరావు, భవాని, డీటీ శివరాజ్, జూనియర్ అసిస్టెంట్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని చెంపపై కొట్టిన టీచర్
అమలాపురం టౌన్: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలోని ఐ మైండ్స్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న గని శ్రీమాణిక్యాన్ అనే విద్యార్థిని చెంపపై ఆ స్కూలు టీచర్ కొట్టిన విషయం మంగళవారం వివాదంగా మారింది. తమ అమ్మాయి స్కూల్లో కంప్యూటర్ పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో చెంపపై టీచర్ బలంగా కొట్టిందని నల్లా వీధికి చెందిన విద్యార్థిని తండ్రి యెరుబండి సురేష్ వాపోయారు.
స్కూల్‌కు వెళ్లి అడిగితే టీసీ ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారే తప్ప.. ఎందుకు అంతలా కొట్టాల్సి వచ్చిందో చెప్పడం లేదన్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. పట్టణ సీఐ పి.వీరబాబు మాట్లాడుతూ విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు స్కూలు యాజమాన్యం, టీచర్‌ను బుధవారం ఉదయం పిలిచి విచారణ చేస్తామన్నారు.

జగన్‌ను కలిసిన జగ్గిరెడ్డి

జగన్‌ను కలిసిన జగ్గిరెడ్డి